
దీపావళి రాగానే బాంబుల మోత మోగుతుంది. కానీ ఈసారి టపాకాయల మోతను అడ్డకుంది ఒడిశా ప్రభుత్వం. కరోనా వైరస్ కారణంగా ఈనెల 30 వరకు లాక్ డౌన్ ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం దీపావళి సందర్భంగా టపాసులు కూడా విక్రయించద్దని ఆదేశించింది. ఈనెల 10 నుంచి 30 వ తేదీ వరకు ఎలాంటి విక్రయాలు జరపరాదని తెలిపింది. ‘శీతాకాలం సమీపిస్తున్నందున కరోనా వైరస్ మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని, ఈ సమయంలో టపాసుల పేల్చితే కాలుష్యంతో తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని ప్రభుత్వం తెలిపింది. టపాకాయలు కాల్చడం వల్ల ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపింది. ప్రజా ప్రయోజనాల కోసమే 20 రోజుల పాటు టపాకాల విక్రయాన్ని నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.