Indian Army Drone Strikes: 2025, అక్టోబర్ 20న దేశవ్యాప్తంగా దీపావళి శుభకాంతులు విరజిమ్మాయి. అందరూ పండుగను సంతోషంగా జరుపుకున్నారు. దీపాలు వెలిగించారు. ఇక ప్రధాని నరేంద్రమోదీ సముద్రం మధ్యలో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై 1,600 మంది సైనికుల మధ్య దీపావళి జరుపుకున్నారు. అయితే తూర్పు సరిహద్దు ఆకాశంలో బుల్లెట్లు, బాంబులు మెరిపించాయి. ఈశాన్య సరిహద్దులో భారత్ సైన్యం ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన డ్రోన్ దాడులు నిర్వహించింది. ఈ దాడులు కేవలం ప్రతీకార చర్యలే కాకుండా, ఉగ్రవాదులకు స్పష్టమైన హెచ్చరిక.
సరిహద్దు దాటి ఆపరేషన్
మయన్మార్‌ను ఆనుకుని ఉన్న సెగాయింగ్ రాష్ట్రంలోని దట్టమైన అడవుల్లో స్థిరపడ్డ మూడు ప్రధాన ఉగ్రసంస్థల కేంద్రాలపై భారత్ దీపావళి రోజు డ్రోన్ దాడులు చేసింది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (అల్ఫా–ఎన్‌ఎఫ్‌ఎ). ఇది అసోంను విభజించాలని డిమాండ్ చేస్తోంది. మరో ఉగ్ర సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ).. ఇది మణిపూర్ ఆధారంగా కార్యకలాపాలు సాగించే మైతేయీ ఉగ్రసంస్థ. మూడోది ఎన్‌ఎస్‌ఈఎన్–కేవైఏ గ్రూప్ (నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–కప్లాంగా యాంగ్‌ఆంగ్ విభాగం).గ్రేటర్ నాగాలాండ్ ఏర్పాటే వీరి అంతిమ లక్ష్యం. ఈ మూడు సంస్థలను భారత సైన్యం టార్గెట్ చేసింది.
డ్రోన్ దాడుల్లో కీలక నేతలు మృతి..
సెగాయింగ్ ప్రాంతంలోని ఎన్‌ఎస్‌ఈఎన్‌కేవైఏ స్థావరంపై జరిగిన దాడిలో ఆ సంస్థ మేజర్ జనరల్ పీ.ఆంగ్‌మాయ్ ఇంటి సమీపంలో బాంబులు కురిశాయి.
ఆయన కుమారుడు కాంపాయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది మిలిటెంట్లు మరణించినట్లు సమాచారం. ఆంగ్‌మాయ్ తప్పించుకున్నాడా, మరణించాడా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ఈ దాడుల్లో మరో రెండు సంస్థలకు చెందిన నాయకులు కూడా మరణించారు.
నాలుగు రోజుల ముందు దాడి..
నాలుగు రోజుల క్రితం అసోం రైఫిల్స్ చెక్‌పోస్టులపై ఉగ్రదాడులు జరిగిన తర్వాతే సైన్యం ఈ డ్రోన్ ఆపరేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జూలైలోనూ ఇలాంటి దాడిలో మూడు గ్రూపులకు చెందిన రెండు కమాండర్లు హతమయ్యారు. తాజాగా దీపావళి రోజున జరిగిన ఆపరేషన్‌తో మూడేళ్లలో మూడోసారి భారత్ మయన్మార్ అడవుల్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసినట్లయింది.
పర్వతాల గుండా రాకపోకలు..
అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ దాటి సెగాయింగ్ వరకు విస్తరించిన పర్వతాలు, అటవీ మార్గాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయి. ఈ మార్గాల ద్వారానే ఉగ్రసంఘాలు భారత సరిహద్దులోకి చొరబడుతూ విధ్వంస కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. దాడులు సరిహద్దు రక్షణను మాత్రమే కాకుండా, ఈ దురాక్రమణ మార్గాల నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీపావళి రోజున జరిగిన ఈ ఆపరేషన్‌తో భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చింది. దేశ సరిహద్దులు ఎక్కడైనా ఉగ్రవాదాన్ని పెంచే ప్రయత్నాలను అంగీకరించబోమని తాజా దాడులతో క్లారిటీ ఇచ్చింది.