
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్రం మరోసారి నిధులు విడుదల చేసింది. ఏడో విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.6 వేల కోట్ల రుణాలు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఇందులో 23 రాష్ట్రాలకు 5,516.60 కోట్లు.. కేంద్ర పాలిత ప్రాంతాలైన దిల్లీ, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరికి రూ.483.40 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలు ఆదాయాలు కోల్పోకపోవడంతో వాటికి పరిహారం విడుదల చేయలేదని తెలిపింది. తాజాగా విడుదల చేసిన మొత్తంతో కలిపి ఇప్పటి వరకు రూ.42వేల కోట్లు రాష్ట్రాలకు కేంద్రం రుణాలుగా ఇచ్చింది.