
అంబానీల కుటుంబంలోకి నూతన వారసుడు వచ్చాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తొలిసారి తాత హోదాను సంపాదించారు. ఆయన కుమారుడు ఆకాశ్, కోడలు శ్లోక దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. దీంతో తల్లిదండ్రులతోపాటు అంబానీలు, మెహతాల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అంబానీ కుటుంబం నుంచి గురువారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ”శ్రీకృష్ణుని దయ, ఆశీర్వాదాలతో శ్లోక, ఆకాశ్ అంబానీ దంపతులు నేడు (గురువారం) ముంబైలో ఓ మగ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ముఖేశ్ అంబానీ, నీతా దంపతులు మొదటిసారి తాత, నాన్నమ్మ అయినందుకు చాలా సంతోషిస్తున్నారు. ధీరూభాయ్, కోకిలాబెన్ దంపతుల మునిమనుమడిని స్వాగతిస్తూ నీతా, ముఖేశ్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు” అని అంబానీ ఫ్యామిలీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.