
kaun banega crorepati : హిందీలో కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్ పతి షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో తెలిసిందే. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షో ప్రేక్షకుల ఆదరాభిమానాలతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ గేమ్ షోకు సంబంధించిన 13వ సీజన్ ఈ మధ్యనే ప్రారంభమైంది. ఈ షాలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకొని సత్తా చాటింది ఆగ్రాకు చెందిన హిమానీ బుందేల్. ఇప్పుడు కోల్ కతాకు చెందిన ఓ డాక్టర్ మాత్రం కోట్లాది మనసులు గెలుచుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది? అంతగా ఆమె ఏం చేసింది? అన్నది చూద్దాం.
కోల్ కతాకు చెందిన ఆ డాక్టర్ పేరు సంచాలీ చక్రవర్తి. ఆమె చిన్న పిల్లల వైద్యురాలిగా పనిచేస్తున్నారు. అయితే.. వైద్యం పేరు చెప్పి డబ్బులు సంపాదించాలని చూసే డాక్టర్ కాదు ఆమె. తనకు ఉన్నదాంట్లో సమాజానికి ఏదోవిధంగా సహకారం అందించాలని చూసే వైద్యురాలు ఈ సంచాలీ. నిరుపేద పిల్లలు చదువు అందించాలనేది ఆమె కల.
ఇందుకోసమే కౌన్ బనేగా కరోడ్ పతి షోకు వచ్చారు సంచాలీ. తాజాగా ఈమె పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ గేమ్ షోలో మొత్తం 12 ప్రశ్నలు అడగ్గా.. 11 ప్రశ్నలకు సమాధానం చెప్పింది సంచాలీ. 12వ ప్రశ్న అయిన ‘‘మహిళలకు మొదటిసారిగా నోబెల్ బహుమతిని ఎప్పుడు ప్రదానం చేశారు?’’ అనే దానికి మాత్రం సమాధానం చెప్పలేకపోయారు.
తన చేతిలో అప్పటికీ ఒక లైఫ్ లైన్ మిగిలి ఉంది. కానీ.. ఏ మాత్రం ఐడియా లేని ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆమె సిద్ధపడలేదు. ఒకవేళ తప్పయితే.. అప్పటి వరకు గెలుచుకున్న డబ్బులో సగానికిపైగా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే.. రిస్క్ తీసుకోవడం ఎందుకని గేమ్ ను ఆపేయడానికి సిద్ధపడి ‘క్విట్’ చెప్పేసింది.
దీంతో.. అప్పటి వరకు ఆమె గెలుచుకున్న మొత్తం 6.40 లక్షలకు చెక్కు రాసి అందజేశారు అమితాబ్ బచ్చన్. అయితే.. అందరినీ అడిగినట్టుగానే ఈ డబ్బును ఏం చేస్తారు? అని అడగ్గా.. తన జీవితంలో ఇది మరిచిపోలేని రోజు అని చెప్పిన ఆమె.. ఈ డబ్బును పేదరికం కారణంగా చదువుకు దూరమవుతున్న పిల్లల కోసం ఖర్చు చేస్తానని చెప్పారు. ఎప్పటి నుంచో తనకు ఈ కోరిక ఉందని, ఇప్పుడు ఈ డబ్బుతో ఆ పని చేస్తానని చెప్పారు సంచాలీ చక్రవర్తి. ఆ విధంగా.. ఆమె కోటి రూపాయలు గెలుచుకోలేకపోయినప్పటికీ.. కోట్లాది మంది మనసులు మాత్రం గెలుచుకున్నారు.