Zubeen Garg funeral: జనం.. మామూలు జనం కాదు.. ఇసుక వేస్తే రాలనంత అనే సామెత వాడుతుంటాం కదా.. అది కూడా సరిపోదు.. నేల పండిందా.. ఆకాశం ఈనిందా అన్నట్టుగా జనం వచ్చారు. తండోపతండాలుగా కాదు.. అంతకుమించి అనే స్థాయిలో వచ్చారు. ప్రతి ఒక్కరిలోనూ దుఃఖం.. ప్రతి ఒక్కరిలోనూ అంతులేని ఆవేదన. కన్నీరు ఒలుకుతూనే ఉంది. ఇంటి కుటుంబ సభ్యుడు చనిపోయినట్టు.. దగ్గర వ్యక్తిని కోల్పోయినట్టు.. ప్రతి ఒక్కరిలోనూ నిర్వేదం.. మాటలకందని విషాదం.. అంతటి జనము వచ్చారంటే అతడు ఎంతటి పుణ్యాత్ముడో.. ఎంతటి ధీరో దాత్తుడో..
ఇటీవల ప్రముఖ అస్సామీ సింగర్ జూబిన్ గార్గ్ అనారోగ్యంతో కన్నుమూశాడు. సంప్రదాయ అసెంబ్లీలో అతడు ఎన్నో పాటలు పాడాడు. ఆ పాటలు మొత్తం అస్సామీ సంస్కృతిని ప్రతిబింబించాయి. తమ ప్రాంత గౌరవాన్ని అమాంతం నిలబెట్టాయి. అటువంటి ఘనత ఉన్న అతడు కన్నుమూయడంతో అస్సామీ ప్రజలు తట్టుకోలేకపోయారు. అతడు చనిపోయిన విషయాన్ని తెలుసుకొని సామూహికంగా వీధుల్లోకి వచ్చారు. బాధపడ్డారు. కన్నీరు పెట్టారు. అతని ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతడి అంతిమయాత్రలో మేము సైతం అంటూ పాదాలు కలిపారు. అతడిని స్మరిస్తూ పెదాలు కదిలించారు.
జుబిన్ గార్గ్ పాడిన పాటలే కాదు.. చనిపోయినప్పటికీ అతడు సరికొత్త రికార్డు సృష్టించాడు. అతని అంత్యక్రియలకు భారీగా జనం హాజరు కావడంతో అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా నాలుగవ అతిపెద్ద ఫ్యునరల్ గ్యాదరింగ్ గా పేరుపొందింది. మైకేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజబెత్ -2 తర్వాత ఇతడి అంత్యక్రియలకే అంతమంది హాజరయ్యారని పేర్కొంది. ఆ రద్దీతో గుహవాటి ప్రాంతంలో దుకాణాలను మొత్తం మూసివేశారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిపివేశారు. లక్షల మంది కన్నీరు కార్చడంతో గుహవాటి ప్రాంతం శోకసంద్రంగా మారిపోయింది.