Whatsapp: వాట్సాప్ లేని ప్రస్తుత జీవితాన్ని ఊహించలేం. పలకరింపుల నుంచి బయట పనులు, ఉద్యోగ బాధ్యతలు..కుటుంబాల మధ్య బంధుత్వాలు అన్నీ వాట్సాప్ లోనే జరుగుతున్నాయి. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ గ్రూప్ గా.. స్నేహితులుగా.. గ్రామం, వార్డు, మండలం ఇలా గ్రూపులుగా చేరి తమ అనుభూతులు పంచుకుంటున్నారు. రోజురోజుకు ఇది లేనిదే నడవని స్థితికి చేరుకున్నాం..

అయితే మన అవసరాలకు, సామాజిక సేవకు ఉపయోగించుకోవాల్సిన వాట్సాప్ ను కొందరు సంఘ విద్రోహాలకు వాడుతున్నారు. అదే సమాజంలో ఘర్షణలకు దారితీస్తోంది. దాన్ని నివారించేందుకు ఇప్పుడు వాట్సాప్ సంస్కరణల బాట పట్టింది. ఈక్రమంలోనే గ్రూప్ అడ్మిన్ లకు బ్రహ్మాస్త్రాన్ని అందించింది.
ఇన్నాళ్లు ఎవరూ విద్వేష మెసేజ్ చేసినా అందరూ చూస్తూ మిన్నకుండిపోయారు. కానీ ఇకనుంచి విద్వేష మెసేజ్ లు చేస్తే వాటిని డిలీట్ చేసే ఆప్షన్ ను వాట్సాప్ రూపొందించింది. గ్రూప్ అడ్మిన్ లు ఏ కల్లోలం సృష్టించే మెసేజ్ ను అయినా గ్రూప్ నుంచి డిలీట్ చేయవచ్చు. ఆ అధికారాన్ని వాట్సాప్ తాజాగా కట్టబెట్టింది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే అందరికీ అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే ఐఫోన్ ఐఓఎస్ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ తెలిపింది. దీని ద్వారా గ్రూపులో రెచ్చగొట్టే మెసేజ్ లు చేసే ఎవరి పోస్ట్ ను అయినా గ్రూప్ అడ్మిన్ లు డిలీట్ చేసి ఈ నష్టనివారణను ఆదిలోనే తుంచివేయవచ్చన్న మాట..