Rajasthan Kota: ఎందుకీ ఆత్మహత్యల పరంపర.. కోటాలో ఏం జరుగుతోంది?

ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన బహదూర్, రాజస్తాన్‌ జలోర్‌కు చెందిన పుష్పేంద్ర సింగ్‌ , బిహార్‌కు చెందిన భార్గవ్‌ మిశ్రా, యూపీకి చెందిన మంజోత్‌ చాబ్రా, ఇప్పుడు యూపీలోని అజమ్‌గఢ్‌కు చెందిన మనీశ్‌ ప్రజాపతి.

Written By: Raj Shekar, Updated On : September 13, 2023 12:24 pm

Rajasthan Kota

Follow us on

Rajasthan Kota: రాజస్తాన్‌లోని కోటా.. ప్రవేశ పరీక్షల కోచింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు విద్యార్థి ఆత్మహత్యలకు కోటలా మారింది. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకి కారణం మాత్రం అంతుచిక్కడం లేదు. అసలు కోటాలో విద్యార్థులు ఎందుకు సూసైడ్‌ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు.

కళ్లు చెదిరే కోటా..
కోటాలో ఏ కోచింగ్‌ సెంటర్‌లో అడుగుపెట్టినా కళ్లు చెదురుతాయి. పెద్ద రిసెప్షన్‌ హాల్, లగ్జరీ ఫర్నీచర్, గోడలకి పెయింటింగ్‌లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్‌ సిస్టమ్, ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌ని తలపించేలా సకల సదుపాయాలు. ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఆశతో కలలు కనే విద్యార్థులకు కావల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్‌ అవడానికి దేశం నలుమూలల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కోచింగ్‌ తీసుకున్నవారికి ఐఐటీ, ఐఐఎంలలో అత్యధిక మందికి సీటు లభిస్తున్నప్పటికీ చాలా మందిలో భవిష్యత్‌పై భరోసా కూడా కరువు అవుతోంది. విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కొందరు హాస్టల్‌ భవనంపై నుంచి దూకి, మరికొందరు సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని , కొందరు సూసైడ్‌ నోట్‌ రాసి మరికొందరు మౌనంగా కన్నవారికి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నారు.

అంతా 19 ఏళ్లలోపు వాళ్లే..
ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన బహదూర్, రాజస్తాన్‌ జలోర్‌కు చెందిన పుష్పేంద్ర సింగ్‌ , బిహార్‌కు చెందిన భార్గవ్‌ మిశ్రా, యూపీకి చెందిన మంజోత్‌ చాబ్రా, ఇప్పుడు యూపీలోని అజమ్‌గఢ్‌కు చెందిన మనీశ్‌ ప్రజాపతి .. ఇలా ఈ ఏడాది ఇప్పటి వరకు 25 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా విద్యార్థులే.. అందరూ 16 నుంచి 19 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారే. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నా­యి.

12 ఏళ్లలో 150 మంది..
గడిచిన 12 ఏళ్లలో 150 మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత కోచింగ్‌ సెంటర్‌లు ప్రారంభమయ్యాక 2021లో నలుగురు ఆత్మహత్యకు పాల్పడితే, 2022లో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 25 మంది బలవన్మరణం చెందారు. కేవలం 8 నెలల వ్యవధిలోనే ఇంత మంది ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపరుస్తోంది.

కారణాలు ఇవేనా..
– ఇది పోటీ ప్రపంచం. వంద సీట్లు ఉంటే లక్ష మంది పరీక్ష రాస్తున్నారు. అంత పోటీని తట్టుకొని విజయం సాధించడం సులభం కాదు. అందుకే విద్యార్థులు ప్రెషర్‌ కుక్కర్‌లో పెట్టినట్టుగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. తాము కన్న కలలు కల్లలవుతాయన్న భయంతో నిండు ప్రాణాలు తీసేసుకుంటున్నారు.

– కోటాలో ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్లో యూపీ, బిహార్‌ వంటి రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువ. ఆ విద్యార్థులు వారి స్కూల్లో ఫస్ట్‌ ర్యాంకర్స్‌. దీంతో తల్లిదండ్రులు గంపెడాశలతో అప్పో సప్పో చేసి కోటాలో చేర్పిస్తున్నారు. తమ స్కూల్లో హీరోగా వెలిగిన విద్యార్థికి అక్కడికి రాగానే తాను లక్షల మందిలో ఒకడినన్న వాస్తవం తెలుస్తుంది. మిగిలిన విద్యార్థులతో నెగ్గుకు రాలేక, తల్లిదండ్రుల్ని నిరాశపరచలేక ఆత్మహత్యకి పాల్పడుతున్నారు.

– కోటాలో కోచింగ్‌ తీసుకునే విద్యార్థులు రోజుకి 16–18 గంటల చదవాలి. ఉదయం 6.30 నుంచి మళ్లీ అర్ధరాత్రి 2 వరకు తరగతులు ఉంటాయి. అంటే విద్యార్థి పడుకోవడానికి ఇచ్చే సమయం కేవలం నాలుగు గంటలు. మధ్యలో తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. కంటినిండా నిద్రకి కూడా నోచుకోని చదువుల భారం వారి ప్రాణాలు తోడేస్తోంది.

రాజస్తాన్‌ పోలీసుల లెక్క ఇదీ..
రాజస్థాన్‌ పోలీసులు ప్రకారం ఆత్మహత్యలను పరిశీలిస్తే 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2020, 2021లో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్యకు పాల్పడలేదు. ఆత్మహత్యలను నిరోధించేందుకు పిల్లలకు మానసిక ఒత్తిడి తగ్గించేలా మద్దతు ఇవ్వాలని కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న ఆత్మహత్యల నివారణకు సిఫారసులు చేయాలని రాజస్తాన్‌ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.