HomeజాతీయంIndependence Day 2023 : అర్థరాత్రి స్వాతంత్య్రం: నాడు నెహ్రూ ఏం చెప్పారంటే

Independence Day 2023 : అర్థరాత్రి స్వాతంత్య్రం: నాడు నెహ్రూ ఏం చెప్పారంటే

Independence Day 2023 : బ్రిటిష్‌ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు దీర్ఘకాలం క్రితం శపథం చేశామని.. ఇప్పుడు నవ భారత సేవకు పునరంకితమవుతామని మరోసారి ప్రతినబూనాలని నెహ్రూ ఆనాడు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారతం మతతత్వానికి.. సంకుచితత్వానికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ‘‘అర్ధరాత్రి 12 గంటలు కొట్టినప్పుడు.. ప్రపంచమంతా గాఢనిద్రలో ఉన్న వేళ.. భారతదేశం నవ జీవితంలోకి, స్వాతంత్య్రంలోకి అడుగుపెట్టింది. చరిత్రలో ఇలాంటి క్షణం అరుదుగా వస్తుంది. పాత నుంచి కొత్తలోకి అడుగుపెట్టినప్పుడు.. ఒక శకం ముగిసినప్పుడు.. సుదీర్ఘకాలం ఓ జాతి ఆత్మను అణచివేసినప్పుడు.. కొత్త గొంతుకొకటి జీవం పోసుకుంటుంది. దేశసేవకు, భారత ప్రజలకు.. మొత్తం మానవాళి సేవకు అంకితమవుదామని ప్రతిన బూనేందుకు ఇది అనువైన సమయం’’ అని తెలిపారు.

విలువలు మరవొద్దు..

చరిత్ర మలుపుల్లో భారత్‌ తన అన్వేషణను ప్రారంభించిందని.. శతాబ్దాల ప్రయాణంలో ఎన్నో విజయాలు, వైఫల్యాలు చవిచూసిందని.. అదృష్ట దురదృష్టాల్లో ఏనాడూ తన అన్వేషణ ఆపలేదని.. అలాగే తన విలువలనూ మరచిపోలేదని నెహ్రూ పేర్కొన్నారు. ‘‘మనం పండుగ చేసుకుంటున్న ఈ విజయం.. గొప్ప విజయావకాశాలకు ఆరంభం దిశగా ఓ అడుగు మాత్రమే. ఈ అవకాశాలను చేజిక్కించుకోగల సత్తా, తెలివిడి మనకున్నాయా? భావి సవాళ్లను ఎదుర్కోగలమా? స్వాతంత్య్రం, అధికారం.. బాధ్యతను తీసుకొస్తాయి. ఈ గురుతర బాధ్యత స్వతంత్ర భారత పౌరులకు ప్రాతినిధ్యం వహించే సార్వభౌమాధికార సంస్థ అయిన ఈ (రాజ్యాంగ) అసెంబ్లీపైనే ఉంది. స్వేచ్ఛావాయువులు పీల్చకముందు.. మనం అన్ని రకాల బాధలూ అనుభవించాం. విషాద స్మృతులతో మన హృదయాలు బరువెక్కి ఉన్నాయి. ఈ బాధల్లో కొన్ని ఇప్పటికీ ఉండి ఉండొచ్చు. అయినా గతం గతః. ఇప్పుడు భవిష్యత్‌ మనవైపు చూస్తోంది. సంకుచిత, విధ్వంసక విమర్శలకు.. అసూయాద్వేషాలకు.. పరస్పర ఆరోపణలకు ఇది సమయం కాదు. భరత సంతతి స్వేచ్ఛాయుతంగా జీవించే స్వతంత్ర భారత సమున్నత సౌధాన్ని మనం నిర్మించాల్సి ఉంది’’ అంటూ భవిష్యత్‌ లక్ష్యాన్ని నిర్దేశించారు.

వెలుగులు నింపిన గాంధీజీ..

స్వాతంత్య్రం సముపార్జించిన ఈ రోజున మన ఆలోచనలన్నీ దీనికి కారణమైన స్వేచ్ఛాశిల్పి, జాతిపిత మహాత్మాగాంధీ చుట్టూ తిరుగుతున్నాయని.. ఆయన స్వాతంత్య్రమనే దివిటీని చేపట్టి మన చుట్టూ ఉన్న అంధకారాన్ని పారదోలి వెలుగులు నింపారని నెహ్రూ గుర్తుచేశారు. పెనుగాలులు వీచినా… తుఫాన్లు సంభవించినా ఈ దివిటీని ఆరిపోనివ్వకూడదన్నారు. ‘‘సామాన్యుడికి, రైతులు, కార్మికులకు స్వేచ్ఛ, అవకాశాలు కల్పించేందుకు.. పేదరికం, అవిద్య, వ్యాధులపై పోరాడి అంతం చేయడానికి.. పురోగమన ప్రజాస్వామిక దేశ నిర్మాణానికి.. ప్రతి పురుషుడికి, మహిళకు న్యాయం, సంపూర్ణ జీవితం అందించే ఆర్థిక, సామాజిక, రాజకీయ సంస్థల సృష్టికి కఠోర శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రతిజ్ఞకు సంపూర్ణంగా కట్టుబడి ఉండేదాకా మనకెవరికీ విశ్రాంతి లేదు’’ అని నెహ్రూ స్పష్టం చేశారు.

ఈ తార అస్తమించకూడదు..

‘‘దీర్ఘ సుషుప్తి, పోరాటం తర్వాత మేల్కొని.. స్వేచ్ఛగా, స్వతంత్రంగా భారత్‌ మళ్లీ సగర్వంగా నిలబడింది. చరిత్ర మనకు కొత్తగా మొదలైంది. మనమెలా జీవిస్తామో, ఎలా వ్యవహరిస్తామో ఇతరులు దానిని చరిత్రగా రాస్తారు. ఇది మనకు విధిరాసిన క్షణం. భారత్‌కే కాదు.. మొత్తం ఆసియాకు, ప్రపంచానికి కూడా. ఒక కొత్త తార ఉదయించింది. ఇది తూర్పున పొడిచిన స్వేచ్ఛ అనే తార. ఇది అస్తమించకూడదు. ఈ ఆశ అంతరించకూడదు. మేఘాలు మనల్ని కమ్మేసినా, మన ప్రజల్లో అత్యధికులు బాధల్లో మునిగిపోయినా, క్లిష్టమైన సమస్యలు చుట్టుముట్టినా స్వేచ్ఛను ఆస్వాదిద్దాం. అయితే ఈ స్వేచ్ఛ బాధ్యతలను, భారాలను తీసుకొస్తుంది. స్వేచ్ఛాయుత, క్రమశిక్షణ స్ఫూర్తితో వాటిని మనం ఎదుర్కోవాలి’’

అసమానతలను రూపుమాపాలి..

భారత్‌కు సేవ చేయడం అంటే.. కోట్లాది బాధితులకు సేవ చేయడమేనని.. దీనర్థం పేదరికం, అజ్ఞానం, అవకాశాల అసమానతలను రూపుమాపడమేని నెహ్రూ చెప్పారు. ‘‘కన్నీళ్లు, బాధలు ఉన్నన్నాళ్లూ మన కృషి ముగిసినట్లు కాదు. మన కలలను సాకారం చేసుకోవడానికి కఠోరంగా శ్రమించాలి. ఈ కలలు భారత్‌ కోసమే కాదు… అన్ని దేశాలు, ప్రపంచం మొత్తం కోసం కూడా. శాంతిని విభజించలేం. అలాగే స్వేచ్ఛను కూడా. ఇప్పుడున్న వసుధైక ప్రపంచంలో పురోభివృద్ధిని, విపత్తులను కూడా వేర్వేరుగా చూడలేం’’ అని అన్ని దేశాలకూ హితవు పలికారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version