మరో 11 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరంతో పాటు కొత్త నిబంధనలు కూడా అమలులోకి రాబోతున్నాయి. దేశంలోని ప్రజలు ఈ నిబంధనల గురించి తప్పనిసరిగా అవగాహన ఏర్పరచుకోవాలి. నిబంధనలపై అవగాహన లేకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 2021, జనవరి 1 నుంచి కాంటాక్ట్ లెస్ కార్డుల లావాదేవీల పరిమితి పెరగనుంది. ప్రస్తుతం కాంటాక్ట్ లెస్ లావాదేవీలపై పరిమితి 2 వేల రూపాయలుగా ఉంది.
2021 జనవరి 1 నుంచి లావాదేవీల పరిమితిని 2 వేల రూపాయల నుంచి 5 వేల రూపాయలకు పెంచుతున్నట్టు కొన్ని రోజుల క్రితం ఆర్బీఐ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా పిన్ లేకుండానే సులభంగా లావాదేవీలను జరిపే అవకాశం ఉంటుంది. జనవరి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ విధానం కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఫాస్టాగ్ ఉన్న కార్లను మాత్రమే టోల్ గేట్ల దగ్గర అనుమతిస్తారు.
2017 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ కంటే ముందు తయారైన నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ ఖచ్చితంగా ఉండాలి. మోటారు వాహన చట్టం 1989 లో సవరణలు చేసి కేంద్రం ఫాస్టాగ్ విధానం అమలులోకి తెచ్చింది. ఆర్బీఐ జనవరి 1వ తేదీ నుంచి పాజిటివ్ పే వ్యవస్థను ఆర్బీఐ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇకపై 50 వేల రూపాయల చెక్కులను జారీ చేస్తే ఆ చెక్కులకు సంబంధించి మరోసారి ధృవీకరించాల్సి ఉంటుంది.
సరైన వివరాలను వెల్లడించకపోయినా, చెక్కు జారీ చేసినట్లు చెప్పకపోయినా ఆ చెక్కుకు సంబంధించిన నగదు ఖాతాలలో జమ కాదు. కొత్త సంవత్సరంలో చిన్న వ్యాపారులు మూడు నెలలలకు ఒకసారి జీఎస్టీ రిటర్నులను దాఖలు చేయవచ్చు. కొత్త ఏడాదిలో టూ వీలర్ల, ఫోర్ వీలర్ల కార్ల ధరలు పెరగనున్నాయి. 2021 సంవత్సరం జనవరి 15వ తేదీ నుంచి మొబైల్ ఫోన్ కు ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి కాల్ చేయాలంటే ముందు 0 యాడ్ చేయాలి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ ఇప్పటికే ఈ మేరకు స్పష్టం చేసింది.