India Vs Pakistan: రాణుల కోసం రాజ్యాలను రాపిచ్చిన వారిని చూశాం.. జూదంలో ఓడిపోతే సామ్రాజ్యం మొత్తం అప్పగించిన వారిని చూశాం. శిబి చక్రవర్తి లాంటి ఉదంతాలు, జపాన్ యువరాణి లాంటి త్యాగం.. ఇంకా చాలానే చదివాం. చాలానే చూశాం. కానీ ఒక ద్విచక్ర వాహనం కోసం ఓ దేశ అధ్యక్షుడు సగం దేశాన్ని రాసి ఇవ్వడం మీరు ఎప్పుడైనా చదివారా? లేకుంటే ఎక్కడైనా చూశారా? మీ సమాధానం ఈ రెండు ప్రశ్నలకు లేదు అని అయితే కచ్చితంగా ఈ కథనం చదవాల్సిందే.
ఆర్మీ మేజర్ మాణిక్ షా.. ఒకవేళ అప్పటి కాలంలో సోషల్ మీడియా కనుక ఉండి ఉంటే కచ్చితంగా ఇతడు హీరో అయ్యేవాడు. ప్రధాన మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు ఈ ఇంటర్వ్యూల కోసం వెంపర్లాడేది. ఈయన జీవిత చరిత్ర గురించి చెప్పడానికి తాపత్రయపడేది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు. మీడియా కూడా అంత బలంగా లేదు కాబట్టి ఆయన ఒక వర్గం వరకే పరిమితమైపోయారు.
ఇంతకీ ఆయన ఎవరంటే 1971లో మన దాయాది దేశం పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఆ యుద్ధాన్ని ముందుండి నడిపించింది ఆర్మీ మేజర్ మాణిక్య.. ధైర్యం, సాహసం, ఇంకా ఎన్నో యుద్ధ రీతులతో పాకిస్తాన్ దేశాన్ని మట్టికరించారు. దేశ సైనికులలో పోరాట స్ఫూర్తిని రగిలించుకుంటూ ముందుకు కదిలేలా చేశారు. బుల్లెట్ల వర్షం కురుస్తున్నప్పటికీ.. మందు గుండు సామగ్రి మీద పడుతున్నప్పటికీ లెక్కచేయకుండా సైనికులను వీరోచిత పోరాటం చేసేలా ధైర్యాన్ని నూరి పోశారు. అంతటి గొప్ప సైనికుడు కాబట్టే మాణిక్ షా జీవిత చరిత్ర మీద సామ్ బహుదూర్ అనే సినిమా రూపొందింది. హిందీలో తీసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లా నిలిచింది. ఈ సినిమా ద్వారా మాణిక్ షా లో హాస్య చతురత కూడా ఉందని ఆ తరం ప్రేక్షకులతో పాటు ఈ తరం వారికి కూడా తెలిసింది. అంతేకాదు ఈ సినిమా ద్వారా మరొక కొత్త విషయం కూడా తెలిసింది.
1971 పాకిస్తాన్ దేశంతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దేశ అధ్యక్షుడిగా యహ్యా ఖాన్ ఉన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాలు విడిపోక ముందు మాణిక్ షా, యహ్యా ఖాన్ మంచి స్నేహితులు. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్, ఇండియన్ ఆర్మీలు అంటూ వేరువేరుగా లేవు. కేవలం బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మాత్రమే ఉండేది.. ఆ సైన్యంలో మాణిక్ షా, యహ్యా ఖాన్ కలిసి పని చేశారు. కలిసి పని చేయడం వల్ల ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్తా ప్రాణ స్నేహమైంది. మాణిక్ షా వ్యవహార శైలి యహ్యా ఖాన్ కు బాగా నచ్చేది. అంతేకాదు ఆరు రోజుల్లో అతను వాడే ఎరుపు రంగు బైక్ అంటే యహ్యా ఖాన్ కు చాలా ఇష్టం. ఆ బండిని ఆ రోజుల్లో సుమారు 1000 రూపాయలకి యహ్యా ఖాన్ కొనుగోలు చేశాడు. అయితే అప్పట్లోనే దేశ విభజన జరగటం.. యహ్యా ఖాన్ పాకిస్తాన్ వెళ్లిపోవడంతో.. మాణిక్ షాకు ఆ బండికి సంబంధించిన డబ్బులు యహ్యా ఖాన్ ఇవ్వలేదు. ఈలోపు కాలం గిర్రున తిరిగింది. 1971 నాటికి యహ్యా ఖాన్ పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు అయ్యాడు. ఆ సమయానికి మాణిక్ షా భారత సైన్యానికి అధిపతిగా ఉన్నారు.
1971 నాటికి ఇండియా ప్రధానిగా ఇందిరాగాంధీ కొనసాగుతున్నారు. ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్? ను పాకిస్తాన్ నుంచి వేరు చేసేందుకు యుద్ధం జరిగింది. మాణిక్ షా ఆధ్వర్యంలో భారత సైనిక దళం పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించింది. అనంతరం మాణిక్ షా మాట్లాడాడు. “అప్పట్లో నా బండిని వెయ్యి రూపాయలకి యహ్యా ఖాన్ కు విక్రయించాను. ఈలోపు దేశ విభజన జరిగింది. అతడు డబ్బులు ఇవ్వకుండానే పాకిస్తాన్ వెళ్లిపోయాడు. తనతోపాటు నా బండిని కూడా పట్టుకెళ్లాడు. ఈ లోగానే అతడు పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు అయ్యాడు. కానీ నా బండి డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. ఆ డబ్బుల కోసం 24 సంవత్సరాలు పాటు ఎదురు చూశాను. ఆ డబ్బులు ఇవ్వకపోగా తూర్పు పాకిస్తాన్ రూపంలో సగం దేశాన్ని ఇచ్చాడు” అని అప్పట్లో వ్యాఖ్యానించినట్టు ఈ సినిమా ద్వారా తెలుస్తోంది. అన్నట్టు మాణిక్ షా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇటీవల ఓటీటీ లో విడుదలై దుమ్ము రేపుతోంది.