Rameswaram Cafe Blast: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబు పేలుడు ఘటనకు సంబంధించి విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటన వెనుక ఉగ్ర కోణం ఉందనే అనుమానంతో కేంద్ర, రాష్ట్ర బృందాలు విస్తృతంగా దర్యాప్తు సాగిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది అనుమానితులను దర్యాప్తు బృందాలు అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నాయి.. ఈ క్రమంలో ఈ ఘటన సూత్రధారి ఎవరు అనేది ఇంతవరకు తెలియ రాలేదు. సీసీ ఫుటేజ్ లో మాత్రం ఇడ్లీ తినడానికి వచ్చిన ఒక వ్యక్తి.. బాంబు పెట్టి రిమోట్ సహాయంతో పేల్చినట్టు కనిపించింది. దాని ఆధారంగానే దర్యాప్తు బృందాలు విచారణ సాగిస్తున్నాయి.
ఇక ఈ పేలుడుకు పాల్పడిన వ్యక్తి ఆచూకీ గురించి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆ నిందితుడికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.. ఒకవేళ ఆ నిందితుడికి సంబంధించి ఆచూకీ తెలిసినవారు సమాచారం అందిస్తే 10 లక్షల రివార్డు ఇస్తామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. తమకు సమాచారం తెలిపేందుకు 080-29510 900, 890424 1100 కు ఫోన్ చేయాలని పేర్కొన్నది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రకటించారు.. కాగా, పోలీసుల అదుపులో ఉన్న నిందితులు తెలిపిన సమాచారం ఆధారంగా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన జరిగి ఇన్ని రోజులైనప్పటికీ కీలక నిందితుడు పోలీసులకు చిక్కకపోవడం విశేషం. అయితే రామేశ్వరం కేఫ్ లో మాత్రమే ఎందుకు బాంబు దాడికి పాల్పడినట్టు? ఈ కేఫ్ మాత్రమే కాకుండా మిగతా ప్రాంతాల్లోనూ బాంబు దాడులకు కుట్రలు పన్నారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఘటన జరిగిన తర్వాత బెంగళూరు నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగిన నేపథ్యంలో.. హైదరాబాదులోని మాదాపూర్ బ్రాంచ్ లోనూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.. పైగా హైదరాబాద్ రామేశ్వరం కేఫ్ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా పని చేసే ప్రాంతంలో ఏర్పాటు కావడంతో పోలీసులు ఈ ప్రాంతంపై నిఘా పెట్టారు. ఇప్పటికే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రాంతాన్ని పలుమార్లు సందర్శించారు. భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు పలు సూచనలు చేశారు. రామేశ్వరం కేఫ్ మాత్రమే కాకుండా సున్నితమైన ప్రాంతాలలో భద్రతను మరింత పెంచారు.