Konathala Ramakrishna: ఏపీలో పొత్తుల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. బిజెపి విషయంలో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. అంతకంటే ముందు టిడిపి, జనసేనల మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. కీలక సీట్ల విషయంలో చేర్పులు, మార్పులు ఉండబోతున్నాయి. ఇదివరకు ప్రకటించిన సీట్లలో సైతం మార్పులు చోటుచేసుకోనున్నాయి. నెల్లిమర్ల, అనకాపల్లి సీట్ల విషయంలో మార్పులు ఖాయంగా తేలుతోంది. ముఖ్యంగా అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి కొణతాల రామకృష్ణ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా మారిన వ్యూహాలతో అది అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టు ఆయన కార్యాచరణ సైతం అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో ప్రారంభించారు. కానీ సీట్ల సర్దుబాటు అయ్యాక కొంత స్లో అయ్యారు. అయితే కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ సీటు ఆఫర్ తోనే జనసేనలో చేరారు. నాగబాబు తెరపైకి రావడంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా అయిష్టతతోనే ఒప్పుకున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కూటమిలో ఇప్పటివరకు ఉన్న అంచనాలకు భిన్నంగా కొన్ని సీట్లలో మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే కొణతాల రామకృష్ణను ఎంపీ స్థానానికి పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అనకాపల్లి అసెంబ్లీ సీటును టిడిపికి కేటాయించే అవకాశం ఉంది. అక్కడ టిడిపి నేత పీలా గోవింద్ తప్పకుండా గెలుస్తారని అంచనాలు ఉన్నాయి.
అనకాపల్లి విషయంలో తీవ్ర సంప్రదింపులు జరుగుతున్నాయి. పీలా గోవింద సత్యనారాయణ చంద్రబాబును కలిశారు. అటు పవన్ కళ్యాణ్ తోనూ భేటీ అయినట్లు సమాచారం. చంద్రబాబుతో బుధవారం ఉదయం జరిపిన చర్చల్లో సీట్లు, అభ్యర్థుల అంశంపై చర్చలు సాగినట్లు తెలుస్తోంది. మరోవైపు బిజెపితో పొత్తుల విషయంపై ఢిల్లీలో కీలక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వీటిపై రెండు రోజుల్లో ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే రెండో జాబితా ప్రకటన, మూడు పార్టీల అభ్యర్థుల ఎంపిక ఒకేసారి పూర్తిచేసే అవకాశం ఉంది. మరోవైపు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వివాదం పరిష్కారమైనట్లు సమాచారం. అక్కడ జనసేన నేత కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గానికి వెళ్లేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. వీలైనంత వరకు నియోజకవర్గాల్లో ఎటువంటి వివాదాలు లేకుండా చూసుకోవాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి.