Uniform Civil Code : ఉమ్మడి పౌరస్మృతిపై కేంద్రం సంచలనం.. ఏం జరుగనుంది?

త్వరలో సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్నది. ఇదే జరిగితే కోడ్‌ అమల్లోకి తెచ్చిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ చరిత్రకెక్కుతుంది.

Written By: K.R, Updated On : July 1, 2023 2:49 pm
Follow us on

Uniform Civil Code : త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరో ఏడాది సార్వత్రిక ఎన్నికలు.. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరో వివాదాస్పదమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. తేనె తుట్టే లాంటి ఉమ్మడి పౌర స్మృతిని అమలులోకి తీసుకొచ్చేందుకు బలమైన అడుగులు వేసింది. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఏకంగా పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు సమాయత్తమైంది. జూలై మూడో వారంలో మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు పెట్టాలని నిర్ణయించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. న్యాయశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం జూలై 3న కేంద్ర న్యాయశాఖకు చెందిన చట్టవ్యవహారాలు, శాసనసభ వ్యవహారాల విభాగాలు, లా కమిషన్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఆ సందర్భంగా బిల్లుకు తుది తీసుకురావాలని భావిస్తోంది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాక దీనిని మరింత లోతుగా పరిశీలించేందుకు సెలెక్ట్‌ కమిటీకి పంపుతారని తెలుస్తోంది. ప్రభుత్వం నియమించిన ఆ కమిటీ వివిధ వర్గాలు, భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతుంది.

ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి
కేంద్రం తీసుకొచ్చిన ఉమ్మడి పౌరస్మృతి వ్యవహారంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోదీ ఈ వివాదాస్పద అంశాన్ని లేవనెత్తారని మండిపడుతున్నాయి. “ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి కీలక సమస్యల నుంచి, మణిపూర్‌లో శాంతిభద్రతల వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు దీనిని తెరపైకి తెచ్చారు. ” అని ఆరోపిస్తున్నాయి. ఇక ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆప్‌, బీజేడీ, శివసేన (ఉద్ధవ్‌) ఉమ్మడి కోడ్‌కు మద్దతు ప్రకటించాయి. ఎన్‌సీపీ తటస్థ వైఖరితో ఉండగా.. కాంగ్రెస్‌, జేడీయూ, టీఎంసీ, ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ, వామపక్షాలు సహా మిగతా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జూన్‌ 14వ తేదీన లా కమిషన్‌ యూసీసీపై ప్రజాభిప్రాయం కోరుతూ ‘వ్యక్తిగత చట్టాలపై సమీక్ష’ పేరిట పబ్లిక్‌ నోటీసు విడుదల చేసింది. దీనికి జూన్‌ 27 వరకు 8.5 లక్షల అభిప్రాయాలు వచ్చాయి.
విద్వేషాలు వ్యాపింప చేస్తున్నారు
ప్రజలను విభజించి విద్వేషాలు వ్యాపింపజేయాలని బీజేపీ భావిస్తోందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. అది యూనిఫాం సివిల్‌ కోడ్‌ (యూసీసీ) కాదని.. విభజించే సివిల్‌ కోడ్‌ (డీసీసీ) అని ధ్వజమెత్తుతోంది. ‘ఉమ్మడి పౌరస్మృతి ద్వారా దేశ రాజకీయాలను, ప్రజలను విభజించి.. విద్వేషాలను వ్యాపింపజేయడమే బీజేపీ ఉద్దేశం. ప్రధాని కూడా ప్రత్యేక వర్గం (ముస్లింలు) పేరుపెట్టి మాట్లాడుతున్నారు. కానీ యూసీసీ అంటే ఒక వర్గానికి సంబంధించింది కాదు. ప్రతి వర్గం, మతం, భాషకు సంబంధించింది. మనమేదైనా పనిచేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి’ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. యూసీసీని తెరపైకి తేవడానికి ప్రధాన కారణం అది బీజేపీ ఎన్నికల ఎజెండా కావడమేనని సీపీఎం ఆరోపిస్తోంది. దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ‘సాంస్కృతిక భిన్నత్వాన్ని తుడిచివేసి.. ఒక దేశం.. ఒకే సంస్కృతి అనే మెజారిటీ మతం ఎజెండాను అమలు చేయాలన్న పథకమిది. కేంద్రం, లా కమిషన్‌ ఈ ఆలోచనను విరమించుకోవాలి’ అని సిపిఎం సూచిస్తున్నది.
యూసీసీకి ఉద్ధవ్‌, షిండే సేనల మద్దతు
విపక్ష కూటమిలోని శివసేన (ఉద్ధవ్‌) పార్టీ.. ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు ప్రకటింది. యూసీసీ ఉండాలన్నది తమ వైఖరి అని శివసేన చెబుతోంది. అయితే బిల్లు ముసాయిదా విడుదలయ్యాక అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తామని వివరిస్తోంది. ఎప్పుడు బిల్లు పెడితే అప్పుడు మద్దతిస్తామని చెబుతోంది. ఇంకోవైపు.. ఒక దేశం.. ఒకే చట్టం అన్న బాల్‌ ఠాక్రే విజన్‌కు తాము మద్దతిస్తామని ప్రకటించడం విశేషం.
ఉత్తరాఖండ్‌ ‘కోడ్‌’ రెడీ
దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా సిద్ధమైంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం జూలై నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. త్వరలో సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్నది. ఇదే జరిగితే కోడ్‌ అమల్లోకి తెచ్చిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ చరిత్రకెక్కుతుంది.