
దేశంలో సామాన్యుల నుంచి ధనవంతుల వరకు చాలామంది బ్యాంకులలో బంగారం రుణాలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారనే సంగతి తెలిసిందే. అలా బంగారం రుణాలు తీసుకున్న వాళ్లకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. లోన్ మారటోరియం వడ్డీ మాఫీ స్కీమ్ గోల్డ్ లోన్ రుణాలకు కూడా వర్తిస్తుందని కీలక ప్రకటన చేసింది. కేంద్రం కొన్ని నెలల క్రితం రుణాలు తీసుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా లోన్ మారటోరియం బెనిఫిట్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
కేంద్రం రుణాలు తీసుకున్న వాళ్లు మార్చి నెల నుంచి ఆగష్టు నెల వరకు ఆరు నెలల పాటు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదని కీలక ప్రకటన చేసింది. అయితే కేంద్రం ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసినా పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ మీద వడ్డీని వసూలు చేశాయి. దీంతో పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించగా కేంద్రం వడ్డీపై వడ్డీ వసూలు చేయబోమని తెలిపింది.
మార్చి నెల నుంచి ఆగష్టు నెల వరకు మారటోరియంను ఎంచుకోని వాళ్లు వడ్డీపై వడ్డీ వెనక్కు పొందే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇప్పటికే రుణ గ్రహీతల ఖాతాల్లో కేంద్రం నగదు జమ చేసింది. అయితే వడ్డీమాఫీ ఏఏ రుణాలపై అమలు చేయనుందో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే కేంద్రం గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్లకు కూడా లోన్ మారటోరియం వర్తిస్తుందని.. గోల్డ్ లోన్ తీసుకుని ఈఎంఐ సక్రమంగా చెల్లించిన వాళ్లకు క్యాష్ బ్యాక్ లభిస్తుందని తెలిపింది.
2 కోట్ల రూపాయల లోపు రుణాలకు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం కలగనుంది. కేంద్రం మార్చి నెల నుంచి ఆగష్టు నెల మధ్య తీసుకున్న రుణాలకు సాధారణ వడ్డీ, చక్రవడ్డీ మధ్య వ్యత్యాసాన్ని బ్యాంకు ఖాతాలలో జమ చేస్తోంది.