Odisha BJP: ఎన్నికల్లో ఒడిశాలో పొత్తులు లేనట్లే. తాము సొంతంగా పోటీ చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అధికార బీజేడి తో కలిసి వెళ్లాలని బిజెపి భావించింది. కానీ బిజెపి నుంచి ఎక్కువ సీట్లు కావాలన్న డిమాండ్ తో.. ఒంటరి పోరాటానికి బిజెడి సిద్ధపడినట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు పొత్తు లేనట్టే. అదే జరిగితే ఒడిస్సాలో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. బిజెపి, బిజెడి, కాంగ్రెస్ మధ్య పోరు నడిచే పరిస్థితి కనిపిస్తోంది.
1998లో జనతా దళ్ పార్టీ ఎన్డీఏలో ఉండేది. బిజు పట్నాయక్ ఆ పార్టీకి సారధ్యం వహించేవారు. ఆయన అకాల మరణంతో నవీన్ పట్నాయక్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటికే జనతాదళ్ పార్టీ ఎన్డీఏ లో ఉండడంతో.. వాజ్పేయి క్యాబినెట్లో నవీన్ పట్నాయక్ మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే తండ్రి బిజు పట్నాయక్ పేరిట.. బిజూ జనతాదళ్ పార్టీని నవీన్ స్థాపించారు. 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. సీఎం పీఠంపై నవీన్ కూర్చున్నారు. ఇప్పటివరకు అప్రతిహాసంగా గెలుపొందుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయోభారంతో బాధపడుతున్నారు. ఆయన బ్రహ్మచారి కావడంతో.. రాజకీయ వారసులు సైతం లేరు.
నవీన్ పట్నాయక్ కు చెందిన బిజూ జనతా దళ్ ఎన్డీఏకు నమ్మదగిన మిత్రపక్షంగా కొనసాగుతూ వచ్చింది. అయితే 2008, 2009లో జరిగిన మతపరమైన అల్లర్ల కారణంగా ఆ రెండు పార్టీలు విడిపోయాయి. ఈ హింసకాండ కు బిజెపి కారణమని చెప్పి బిజెడి ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంది.2009, 2014 ఎన్నికల్లో బిజెపి ఒంటరిగానే పోటీ చేసింది. కానీ మెరుగైన ఫలితాలు సాధించలేదు. ప్రస్తుతం బీజేడి బలమైన స్థితిలోనే ఉంది. కానీ వృద్ధాప్యంలో ఉన్న నవీన్ పట్నాయక్ ను చూసి బిజెపి ఆశలు పెట్టుకుంది. పొత్తులో భాగంగా మెజారిటీ సీట్లు దక్కించుకొని.. ఒడిస్సా లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. క్రమేపి బిజేడిని కబళించి.. ఒడిస్సాలో ఎదగాలని బిజెపి చూస్తోంది. అందుకే బీజేడీ ఈ ఎత్తుగడలను గమనించి దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది.