Opposition Alliance INDIA: బిజెపిని గద్దె దించాలనే తలంపు తో కాంగ్రెస్.. ఎన్నికలకు ఏడాది ముందు ఉండగానే బలంగా అడుగులు వేస్తున్నది. 26 పార్టీలతో యూపీఏను అంతర్దానం చేసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది.. తమ ప్రధాన లక్ష్యం మోడీని పెద్ద దించడమే అని ఇండియా కూటమిలోని పెద్ద తలకాయలు స్పష్టంగా చెప్పాయి.. ఏకంగా రెండు రోజులు మీటింగ్ పెట్టుకుని మోడీని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై తీవ్రంగా చర్చించాయి. మల్లిఖార్జున ఖర్గే నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ వరకు అందరూ గంటలకు గంటలు మాట్లాడారు. సరే వాళ్లకు అధికారం కావాలి కాబట్టి…మోడీని గద్దె దించాలి కాబట్టి ఈ ప్రయాస తప్పదు..కానీ ఎటొచ్చీ ఈ కూటమి ఎన్ని నాళ్ళు నిలబడుతుందనేదే ఇక్కడ అసలు ప్రశ్న.
పేరుకు 26 పార్టీలు అయినప్పటికీ..
పేరుకు 26 పార్టీలు అయినప్పటికీ వీటిలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేడీయూ తప్ప మిగతావన్నీ మామూలు పార్టీలే. పది పార్టీలకు అసలు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు. మోడీని పడగొడతామని చెప్తున్న ఈ కూటమి.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ కూటమిని జనాలు ఆమోదిస్తారు. కాంగ్రెస్ తో పొత్తు, అవగాహన ఉండదని సీతారాం ఏచూరి వంటి వాడు చెప్తున్నాడు. మరి ఈ లెక్కన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమత బెనర్జీ కి, సిపిఎం కు ఇండియా కూటమి ఎన్ని సీట్లు ఇస్తుంది? కూటమి అనగానే ఉమ్మడి అభర్థిని నిలపాలి. లేకపోతే సరైన పోటీ సాధ్యం కాదు.. కానీ కాంగ్రెస్ పార్టీతో మాకు సయోధ్య ఎలా కుదురుతుంది అని సిపిఎం అంటోంది. ఇలాంటప్పుడు ఉమ్మడి అభ్యర్థి అనే ఆలోచన ఎలా సాధ్యమవుతుంది? అసలు ఇండియా కూటమిలో సిపిఎం, కాంగ్రెస్ ఎలా సర్దుకుంటాయి? మమత కాంగ్రెస్, సిపిఎంలను మళ్లీ లేవనిస్తుందా? కేరళలో ఒకవైపు లెఫ్ట్, మరోవైపు కాంగ్రెస్.. రెండు కూటమిలే. యాంటీ బీజేపీ కూటమి పేరిట ఒక్క బ్యానర్ కిందకు లెఫ్ట్, కాంగ్రెస్ జట్టు కట్టే మాటే నిజమైతే కేరళలో లోక్సభ స్థానాల్లో పోటీ మాటేమిటి? అంటే ఈ లెక్కన బెంగాల్, కేరళ తప్ప మిగతా అన్నిచోట్ల యాంటీ బీజేపీ కూటమితో లెఫ్ట్ దోస్తీ కడుతుందా? అనేది అనుమానంగానే ఉంది.
కేరళ మాత్రమే కాదు
కేరళ రాష్ట్రం మాత్రమే కాకుండా మిగతా రాష్ట్రాల్లోనూ ఇలాంటి సమస్యలు కూటమికి ఉన్నాయి. అసలు లెఫ్ట్ పార్టీ యూపీఏ కూటమిలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు బిజెపి వ్యతిరేక చర్చ దేశ ప్రజల్లో బాగా జరిగేందుకు ఉపయోగపడుతుందని భావనతోనే అది కూటమి సమావేశాలకు వస్తోంది. అంతేతప్ప లెఫ్ట్ స్తూలంగా కాంగ్రెస్ వెంట నడవడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. స్టాలిన్, నితీష్, ఉద్ధవ్ లకు కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు పెద్దగా ఇబ్బంది లేదు. ఇప్పటికే డిఎంకె, జేడీయూ వెంట అవి అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఇందులో ఉద్ధవ్ కూటమిని బిజెపి అడ్డంగా కోసేసింది.. శరద్ పవార్ ను కూడా ఇబ్బంది పెట్టింది. అది వేరే విషయం. జేడీయూ నితీష్ మళ్లీ ఎన్డీఏలో చేరినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. శరద్ పవార్ డోలాయమానంలో ఉన్నాడు. ఉద్ధవ్ హిందుత్వను వదిలేసి ప్రస్తుతం తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నాడు. బిజెపికి వ్యతిరేకంగా కూటమిలో చేరి కొత్త పాట పాడుతున్నాడు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఎన్నికలకు వెళ్తే తనకు వచ్చే నష్టమేమిటో తర్వాత గాని అతడికి బోధపడదు.. ఇక అఖిలేష్ యాదవ్ మొన్నటి దాకా కేసీఆర్ తోనే వెళ్లాడు. ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు కూటమిలో కనిపిస్తున్నాడు. ఇతడు కూడా సందేహాస్పదమైన క్యారెక్టర్ కావడంతో పెద్దగా నమ్మే అవకాశం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన వైసీపీ, బీఆర్ఎస్, టిడిపిలు కూటమిలోనూ లేవు. కెసిఆర్ ను కూటమిలో ఎవరూ నమ్మరు. మహా అయితే బీజేపీ కెసిఆర్ ను ఇన్ డైరెక్ట్ గా వాడుకోగలదు. ఇక టిడిపికి ఎన్డీఏ ద్వారాలు ఇంతవరకూ తెరుచుకోలేదు. అటు వైసిపి కూడా అధికారికంగా కూటమిలో లేకపోయినప్పటికీ… అదీ ఒకరకంగా ఎన్డీఏలో భాగస్వామే. ఢిల్లీ ఆర్డినెన్స్ మీద బిజెపితో పోరాటానికి విపక్షం మద్దతు కోసం ఆప్ ఈ కూటమి మీటింగులోకి వస్తోంది. ఎన్నికలవేళ దాని వివరాలు దానికుంటాయి.. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ తో కలిసే ఛాన్స్ కనిపించడం లేదు. ఒకవేళ కలిస్తే అది బిజెపికి లాభం చేకూర్చుతుంది.. అయితే బిజెపికి భారత రాష్ట్ర సమితి డి టీం అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఇక్కడ ప్రస్తుతానికి అంత క్లారిటీ కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ వర్సెస్ మాయావతి.. ఈ రెండు విపక్షాలు కలవడం కూడా అసాధ్యం. ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆప్ తూర్పార పట్టింది. ఇదే పరిస్థితి కాశ్మీర్లో పిడిపి, ఎన్సీ రెండూ విపక్షాలే. వీటికి కూడా పరస్పరం గిట్టదు.