Telangana programming skills : తెలంగాణ ఇప్పుడు దేశానికి దిక్సూచిగా మారింది.. ప్రోగ్రామింగ్ స్కిల్స్ లో మన రాష్ట్రం ఇప్పుడు దేశాన్ని ముందుండి నడిపిస్తోంది. ప్రత్యేక ప్రోగ్రామింగ్ భాషలలో నైపుణ్యం కలిగిన పట్టణ యువత అత్యధిక శాతం కలిగి ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ,కర్ణాటక, కేరళ మొదటి మూడు స్థానాల్లో ఉండడం విశేషం. కేంద్ర స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రాం ఇంప్లీమెంటేషన్ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో తెలంగాణ ఈ అద్భుత ప్రగతి సాధించింది.
రాష్ట్రాలలో డిజిటల్ అక్షరాస్యత గణాంకాల ప్రకారం.. మూడు రాష్ట్రాలలో 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత జనాభాలో 10% మంది ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం కలిగిన అదే వయస్సు వారు ఉన్న జాబితాలో 9% మంది పట్టణ యువకులతో తమిళనాడు నాల్గవ స్థానంలో ఉంది, మహారాష్ట్ర 6.5%తో 5వ స్థానంలో ఉంది. విశేషం ఏంటంటే.. బీహార్, అస్సాం, ఛత్తీస్‌గఢ్ , దేశ రాజధాని న్యూఢిల్లీ వంటి కొన్ని రాష్ట్రాలు కూడా ఈ విభాగంలో నైపుణ్యం కలిగిన యువకులలో 1% కూడా లేరు.
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లో ప్రోగ్రామింగ్ స్కిల్స్ కలిగిన యువకులు దాదాపు 3% ఉన్నారు. అటువంటి నైపుణ్యాలు కలిగిన వయస్సు గల వ్యక్తుల జాతీయ సగటు కేవలం 3% మాత్రమే కావడం గమనార్హం. జాతీయ సగటు 3శాతంతో పోల్చితే తెలంగాణ, కర్ణాటక మరియు కేరళ ఎంతో ముందు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలే ఇప్పుడు దేశాన్ని నడిపిస్తున్నాయని స్పష్టంగా చెప్పొచ్చు.
ఇటీవల పార్లమెంట్‌లో సమర్పించిన నివేదిక కూడా ఇలాంటి నైపుణ్యాల విభాగంలో పట్టణ -గ్రామీణ యువతకు మధ్య ఉన్న పూర్తి వ్యత్యాసాన్ని బయటపెట్టింది. తెలంగాణ , కర్ణాటకలలో, అదే వయస్సులో ఉన్న గ్రామీణ యువత కేవలం 3.5% మాత్రమే ప్రోగ్రామింగ్‌లో తగినంత నైపుణ్యం కలిగి ఉన్నారు. అయితే కేరళలో మాత్రం 9% గ్రామీణ యువత తమ పట్టణ యువత సామర్థ్య స్థాయిలతో పోటీపడుతోంది. ప్రోగ్రామింగ్ -లెర్నింగ్ కేవలం ఉద్యోగం పొందడానికి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని విషయాలను అర్థం చేసుకోవడానికి , తెలుసుకోవాలనే యువకుల కోరికకు కూడా ఉపయోగపడనుంది.
నిర్దిష్ట కారణాల వల్ల మూడు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయని ఐటీ రంగ నిపుణులు తెలిపారు. “ఐటిని అభివృద్ధి చేయడంలో కర్నాటక ముందు వరుసలో ఉంది. బెంగళూరును ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు, హైదరాబాద్ ఐటిపై దృష్టి పెట్టడం వల్ల ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం ఉన్నవారు ఎక్కువగా ఉంటారు. కేరళ విషయంలో ఇది అక్కడ సంపూర్ణ అక్షరాస్యత, విద్య , సామాజిక ఆలోచన వల్ల యువత స్కిల్స్ తో ఉన్నారు” అని టెక్ ట్రయాడ్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భర్ణి కె అరోల్ అన్నారు.
తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు తొమ్మిది లక్షల మంది ఐటి – ఐటి ఎనేబుల్డ్ సర్వీసెస్ ఉద్యోగులు ఉన్నారని, టైర్-టూ నగరాలకు దీన్ని విస్తరిస్తున్నామని.. రాష్ట్రంలో స్కిల్ బేస్‌ను మాత్రమే పెంచాలని నిపుణులు పేర్కొన్నారు.