Jamili Elections: మనదేశంలో కేంద్రం, రాష్ట్రానికి వేరువేరుగా ఎన్నికలు జరుగుతుంటాయి. పార్లమెంటుకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే.. రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతాయి. అంటే అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరగవు. శాసనసభ గడువు ముగిసే ఏడాదిలోపు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ప్రకారం మనదేశంలో ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఆర్థిక భారం కావడంతో ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు కాకుండా, అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలని కేంద్రం నిర్వహించింది. దీనికోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది.. అయితే కాంగ్రెస్ నుంచి సిపిఎం వరకు చాలా పార్టీలు ఈ విధానాన్ని బిజెపి ఆధ్వర్యంలో తెరపైకి తీసుకొచ్చారని ఆరోపిస్తున్నాయి. కానీ ఇది ముమ్మాటికి అబద్ధం. 41 సంవత్సరాల క్రితమే అంటే 1983లోనే ఈ విధానంలో ఎన్నికలు జరపాలని నాటి ఎన్నికల సంఘం నిర్ణయించింది. గత ఏడాది సెప్టెంబర్ 2న ఈ కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ 191 రోజుల్లో నివేదికను రూపొందించింది. నిపుణులు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకొని 18 వేలకు పేజీలకు పైగా నివేదిక రూపొందించింది. లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఒకే ఓటరు జాబితా సిద్ధం చేయాలని సూచించింది.
1983లో ఒకే దేశం, ఒకే ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. 1999 లో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల చట్ట సంస్కరణలపై తన 170 నివేదికను అందజేసింది. 2018లో లా కమిషన్ ఆఫ్ ఇండియా జమిలీ ఎన్నికలపై నివేదిక విడుదల చేసింది. 15 ఆగస్టు 2019 నాటి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహించాలని ఎర్రకోట వేదికగా ప్రసంగించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1, 2023 లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే ఎన్నికపై కమిటీ ఏర్పాటయింది. సెప్టెంబర్ 2న సభ్యులను ప్రకటించారు. హోంశాఖ మంత్రితో సహా ఏడుగురు మంది సభ్యులను ఈ కమిటీ లో నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశం సెప్టెంబర్ 23, 2023న జరిగింది. ఆ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. మరిన్ని మార్గదర్శకాల కోసం లా కమిషన్ తో చర్చించి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. మార్చి 14న ఈ కమిటీ రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది.
అమల్లోకి వస్తే ఏమవుతుంది
దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. బందోబస్తుకు సంబంధించి ఈ ఏకకాలంలో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర బలగాలను వాడుకునే అవకాశం ఉంటుంది. ఏకకాలంలో ప్రభుత్వాలు ఏర్పడటం వల్ల పాలనలో జవాబుదారితనం మరింత పెరుగుతుంది. ప్రభుత్వాలు పడిపోవడం, హంగ్ వంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. తద్వారా దేశ అభివృద్ధికి సంబంధించి బలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది.