Ujjain Case : వాడి వయసు 38. ఆమె వయసు 12. అంటే సగానికి మించి తేడా. ఆ బాలికలో చెల్లినో, తన బిడ్డనో చూసుకోవాల్సిన వాడు.. దారి తప్పాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి ఆ అమ్మాయి పై చేయకూడని పని చేశాడు. రక్తమోడుతూ ఆ బాలిక సహాయం కోసం అర్ధనగ్నంగా సుమారు 8 కిలోమీటర్లు నడిచింది. ఓ గుడి పూజారి బాలిక పరిస్థితిని గుర్తించి కొత్త బట్టలు ఇచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చదువుతుంటేనే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి కదూ! ఒక్కసారి ఆ సంఘటనను తలుచుకుంటే గుండె మొత్తం ద్రవిస్తోంది కదూ! మొన్న జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసు కు సంబంధించి నిందితుడి తండ్రి తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.
ఈ ఘటనకు సంబంధించి ఓ ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక జీవన్‌ఖేరి ప్రాంతంలో ఆటో ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఆటోలో రక్తపు మరకలు ఉండటంతో పోలీసులు ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించారు. నిందితులను గుర్తించారు. బాధితురాలిది మధ్యప్రదేశ్‌లోని మరో జిల్లా అని, ఉజ్జయినికి 700 కి.మీ. దూరంలో ఆమె స్వగ్రామం ఉందని పోలీసులు చెబుతున్నారు. తాత, అన్నతో కలిసి ఉంటోందని.. బడికి వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లోంచి వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
బాలిక మాట్లాడలేకపోయింది..
బాధిత బాలికకు సాయం చేసిన ఆశ్రమ సిబ్బందిలో ఒకరైన రాహుల్ శర్మ ఆమె పరిస్థితిని వివరిస్తున్న తీరు కంటనీరు తెప్పించింది. ‘‘ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆశ్రమం నుంచి బయటకు వచ్చాను. అప్పుడే బాలిక కనిపించింది. రక్తమోడుతూ అర్ధనగ్న స్థితిలో ఉంది. వెంటనే నా దగ్గరున్న దుస్తుల్ని ఇచ్చా. ఆమె ఏమీ మాట్లాడలేకపోతోంది. పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేశా’’ అని తెలిపారు. ‘‘ఆ బాలిక మాతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, ఆమె మాటలు అర్థం కాలేదు. ఆమె ఒక ప్రాంతం గురించి చెప్పింది. కానీ, మాకు అర్థం కాలేదు. అప్పటికే ఆమె వణికిపోతోంది. ఎవరైనా దగ్గరకొస్తే.. నా వెనక్కి వచ్చి దాక్కుంది. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్లారు’ అని శర్మ చెప్పారు. కాగా, బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నా.. ప్రస్తుతానికి ప్రమాదం లేదని ఓ అధికారి వెల్లడించారు. ఘటనపై మహాకాల్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
ఈ ఘటనకు సంబంధించి మధ్యప్రదేశ్ పోలీసులు ప్రధాన నిందితుడు భరత్ సోనీ, ఇద్దరినీ కూడా అరెస్టు చేశారు. గురువారం సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ప్రధాన నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు అతడిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ఇండోర్లోని ప్రభుత్వ మహారాజా తుకోజీ రావు హోల్కర్ ఆసు పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, బాధిత బాలిక చదువు, పెళ్లి బాధ్యతలను తీసుకునేందుకు ఒక పోలీసు అధికారి ముందుకు వచ్చారు. మహా కాల్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ అజయ్ వర్మ బాలిక చదువు, వివాహ బాధ్యతలను తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ బాలిక వేదన తన హృదయాన్ని కదిలించిందని, ఆ క్షణమే దత్తత తీసుకోవాలని ఆయన వివరించారు. బాలికకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తానని తెలిపారు. కాగా, ఈ ఘటనలో ప్రధాన నిందితుడు భరత్ సోనీ పోలీసుల అదుపులో ఉన్నాడు. భరత్ సోనీ చేసిన నేరంపట్ల అతడి తండ్రి ఆవేదనలో కూరుకు పోయాడు. ” ఆ అమ్మాయి కూడా నా కూతురు లాంటిదే. ఆ బాలికపై అంతటి అఘాయిత్యానికి పాల్పడిన నా కొడుకుని ఉరితీసి చంపండి. అతడిని చూసేందుకు నేను జైలుకు వెళ్ళను.” అని అతడు వాపోయాడు. మరోవైపు నిందితుల తరఫున ఎవరూ వాదించకూడదని స్థానిక బార్ అసోసియేషన్ తీర్మానించింది.