https://oktelugu.com/

Ram Mandir: బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం రామేశ్వరంలో మోడీ చేసిన పని ఇది!

అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం వేళ ప్రధాని నరేంద్రమోదీ కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 21, 2024 / 10:58 AM IST

    Ram Mandir

    Follow us on

    Ram Mandir: అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మరి కొన్ని గంటలే ఉంది. ఏర్పాట్లన్నీ పూర్తికావొచ్చాయి. బాల రాముడని ప్రాణ ప్రతిష్ట చేయనున్న మోదీ తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఆదివారం రాత్రి అయోధ్య చేరుకుంటారని తెలుస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు రామ్‌ లల్లా ప్రాణ ప్రతిష్ట పూజలు ప్రారంభిస్తారు. అయితే మహాఘట్టానికి ముందు మోదీ తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించడం, అక్కడి అగ్ని తీర్థంలో పవిత్రస్నానం ఆచరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సంప్రదాయ దుస్తులు, రుద్రాక్ష ధరించిన మోదీ పుణ్యస్నానం చేశారు. ఆలయం ఆవరణలోని తీర్థ బావుల పవిత్ర జలాలను ఒంటిపై పోసుకున్నారు. అనంతరం రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.

    రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాల సందర్శన..
    అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం వేళ ప్రధాని నరేంద్రమోదీ కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న రామ్‌కుండ్‌ కాలారామ్‌ ఆలయం, ఆంధ్రప్రదేశ్‌ లేపాక్షిలోని వీరభద్ర ఆలయం, కేరళ గురువాయుర్‌ ఆలయం, త్రిప్రయార్‌ రామస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. శనివారం(జనవరి 20) తిరుచిరాపల్లిలోని రంగనాథస్వామి, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాలను దర్శించుకున్నారు.

    శ్రీరాముడు పాప పరిహార పూజలు..
    రామేశ్వరం ప్రాంతానికి రామాయణంతో సంబంధం ఉంది. శ్రీ రాముడు రావణాసురుడిని సంహరించిన. తర్వాత ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకు రామేశ్వరం సముద్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు. అందుకే ఈ ఆలయానికి రామనాథస్వామి ఆలయంగా పేరు వచ్చింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామనాథస్వామి ఆలయంలోని శివలింగం ఒకటి. ఏటా ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.

    సీతాదేవి పాతివ్రత్యం నిరూపించుకున్న అగ్నితీర్థం
    ఇక సీతాదేవిని రావణుడి చెర నుంచి విడిపించి తీసుకొచ్చిన తర్వాత ఆమె పాతివ్రత్యం నిరూపించుకునేందుకు రామేశ్వరంలో అగ్నిప్రవేశం చేయించాడని చెబుతారు. అప్పుడు సీతాదేవి పాతివ్రత్యం తట్టుకోలేని అగ్నిదేవుడు సముద్రంలో మునిగి ఉపశమనం పొందాడని పురాణాల్లో ఉంది. అందుకే దీన్ని ‘అగ్నితీర్థం’ అని పిలుస్తారట. ఈ అగ్నితీర్థం సహా మరో 22 తీర్థ బావుల్లోని పుణ్య జలాలను అయోధ్యకు తీసుకెళ్తున్నారు.

    నాటి ప్రళయంలో ఈ ఆలయం ఒక్కటే..
    రామేశ్వరం నుంచి ధనుష్కోటికి వెళ్లే మార్గంలో చిన్న దీవి ఉంది. ఈ దీవిలో కోదండరామస్వామి ఆలయం ఉంది. ఇది కూడా ప్రధానమైన పుణ్యస్థలం. 1964లో ధనుష్కోటిలో ఏర్పడిన ప్రళయంలో అన్నీ తుడుచుకుపెట్టుకుపోగా.. ఈ చారిత్రక ఆలయం ఒక్కటి మాత్రమే చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఆలయంలో శ్రీరాముడు సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, విభీషణుడు కూడా కొలువుదీరి ఉన్నారు.