Modi – Congress : కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.. శనివారం జరిగిన లెక్కింపులో 136 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. బిజెపి 65 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి అన్ని తానై వ్యవహరించారు. ఒకానొక దశలో స్థానిక నాయకత్వాన్ని కూడా దూరం పెట్టారు. కన్నడ ఓటర్లు చివరికి చెంపపెట్టు లాంటి ఫలితం ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయం బోసిపోయి కనిపించింది. ఫలితాలు వెల్లడైన అనంతరం ప్రధానమంత్రి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.
బిజెపి కార్యకర్తలు కష్టపడి పని చేశారు
కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ.. మరొక ట్వీట్ కూడా చేశారు. ఈ ట్వీట్లో బిజెపి కార్యకర్తల కృషిని అభినందించారు.. ఎన్నికల ప్రచారంలో మొక్కవోని కృషితో భారతీయ జనతా పార్టీని ప్రజలకు చేరువ చేశారని కొనియాడారు. మీ శ్రమ వృధాగా పోదు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల అభిమానం చూరగొని అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే పనితీరు కొనసాగించాలని కేడర్ కు దిశా నిర్దేశం చేశారు. ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చిన ప్రజల పట్ల గౌరవంగా ఉండాలని, సమస్యలపై ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.
యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు
ప్రధాని ట్వీట్ కంటే ముందు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓటమిని అంగీకరిస్తున్నామని ప్రకటించారు. ఇదే సమయంలో ఆపధర్మ ముఖ్యమంత్రి బసవరాజ్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇదే సమయంలో యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ పాలనపై లేనిపోని విష ప్రచారం చేశారని, దానిని ప్రజలు నమ్మారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రధానమంత్రి ట్వీట్ ప్రస్తుతం ట్రెండింగ్లో సాగుతుండడం విశేషం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం పట్ల రాహుల్ గాంధీ స్పందించారు. విద్వేష పూరక పాలనకు కర్ణాటక ప్రజలు చరమగీతం పాడాలని, ఇకనుంచి ప్రేమ పూరక పాలన ప్రారంభమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Congratulations to the Congress Party for their victory in the Karnataka Assembly polls. My best wishes to them in fulfilling people’s aspirations.
— Narendra Modi (@narendramodi) May 13, 2023