
భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకూ పరిస్థితి చేయిదాటిపోతోంది. రోజుకు 2 లక్షలకు పైగా కేసులు నమోదువుతుండడంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బెంబేలెత్తిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 2,00,739 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే.. ఈ ఏడాది కరోనా కొత్త కేసుల్లో ఇదే రికార్డు అని చెప్పాలి.
ఇండియాలో ఇప్పటివరకు 1,40,74,564 కేసులు నమోదయ్యాయి. ఇక యాక్టివ్ కేసుల పరంగా చూస్తే 10,06,173 ఉన్నాయి. తాజాగా.. 1,038 మంది మరణించడంతో.. మొత్తం 1,73,123కు మరణాలు పెరిగాయి. దేశంలో 1.4 కోట్లకు పైగా కోవిడ్ కేసులు ఉండడంతో ఇప్పుడు పరిస్థితి ఆందోళన కరంగా మారింది.
ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, గుజరాత్‌లలో నైట్ కర్ఫ్యూ విధించగా.. రోజువారీ కేసుల నమోదులో రికార్డు బ్రేక్ చేస్తున్న మహారాష్ట్ర, రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నారు. 144 సెక్షన్ కూడా అమలు చేస్తోంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ టెన్త్ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేశారు. 12 వ తరగతి విద్యార్థుల పరీక్షలను సైతం వాయిదా వేసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం అనంతరం విద్యాశాఖ మంత్రి ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇప్పటికే మహారాష్ట్రలో పరిస్థితి రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతోంది. తాజాగా.. 58,952 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య 35,78,160 చేరుకోగా.. కొత్తగా 278 మరణాలు సంభవించాయి. మొత్తం మరణాల సంఖ్య 58,804కు చేరుకుంది. ఇక మరోపక్క తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ పెరుగుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాత కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.