NDA Meet : బెంగళూరు ఐటీసీ ట్రైడెంట్ హోటల్ రెండో రోజు విపక్షాలు సమావేశం నిర్వహించాయి. ఇది గేమ్ ఛేంజర్ అని కేసీ వేణుగోపాల్ ప్రకటించినట్టే.. దాదాపు 22 పార్టీల అధినేతలు హాజరయ్యారు. దానికి ఇండియా అని పేరు పెట్టారు. అలా విపక్షాలు సమావేశం నిర్వహించాయో లేదో.. తగ్గేదే లే అన్నట్టుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్వర్యంలో ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల భేటీ నిర్వహించారు. భేటీకి హాజరైన నేతలను మోడీ పేరుపేరునా పలకరించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలంతా గజమాలతో మోడీని సత్కరించారు. అనంతరం భేటీ మొదలయింది.
38 పార్టీల నేతల హాజరు
ఈ సమావేశానికి దాదాపు 38 పార్టీల అధినేతలు హాజరయ్యారు. అయితే ఈ పార్టీల్లో చాలా వరకు చిన్నవి కావడం విశేషం. ఇండియా కూటమి లాగానే ఎన్డీఏ కూటమి భేటీకి హాజరైన చాలా వరకు పార్టీలకు ఒక్క ఎంపీ కూడా లేరు. అయితే ప్రధానమంత్రితో భేటీ ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీకి మార్గం సుగమం అవుతుందని ఆ పార్టీల నేతల భావిస్తున్నారు. ఈసందర్భంగా మోడీ ఎదుట తమ ప్రాంతాల్లో పరిస్థితులను వారు ఏకరువు పెట్టారు. కూటమి ఎలా ఉండాలి? ఎలా అడుగులు వేయాలి? అనే అంశాలపై కూలంకశంగా చర్చించారు. అనవసర విషయాల జోలికి పోకుండానే భేటీని అర్థవంతంగా ముగించారు.
ప్రణాళికాబద్ధంగా అడుగులు
ఇక భేటీలో బీజేపీ చాలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాది, పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ సీట్ల పెంచుకునేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించింది. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి కీలకమైన రాష్ట్రాలలో పకడ్బందీగా భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. వెనుకబడిన తరగతులు, ఇతర కులాలు, తెగల ఓట్లను ప్రభావితం చేయాలని యోచిస్తోంది. బిహార్‌లో అక్కడి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్ని పార్టీలనూ మహాకూటమిలోకి చేర్చారు. లోక్ జనశక్తి మాత్రమే ఇక్కడ బీజేపీకి మిగిలింది. అంతే కాదు అక్కడ చిరాగ్ పాశ్వాన్, అతడి మామ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా పాశ్వాన్ వర్గం ఓట్లు పొందచ్చని భావిస్తోంది. బిహార్ నుంచి మరో మూడు పార్టీలు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన ఉపేంద్ర్ సింగ్ కుష్వాహా, వికాశీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముఖేష్ సహానీ, హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన జితిన్ రామ్ మాంఝీలు ఎన్‌డీఏల చేరతారనే అంచనాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, కేరళ కాంగ్రెస్(థామస్) నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ వర్గం ఈ భేటీల్లో పాల్గొన్నాయి.
ఇక కర్ణాటకలో మొన్న చావు దెబ్బతిన్న జేడీయూ ఎన్‌డీఏ లో చేరుతోందనే వార్తలు వచ్చాయి. ఆ మధ్య ఎన్‌డీఏలో చేరాతనని దేవేగౌడ సంకేతాలు కూడా ఇచ్చారు. కానీ ఆయనకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. మరోవైపు ఆయన కుమారుడు కుమారస్వామి కూడా ఎన్‌డీఏ వైపే వెళ్తున్నట్టు ఆ మధ్య లీకులు ఇచ్చారు. తర్వాత ఎందుకనో చప్పపడ్డారు. అయితే కర్ణాటకలో ఓడిపోయినంత మాత్రాన తమకు క్షేత్రస్థాయిలో పట్టు తగ్గలేదనే కారణంతోనే బీజేపీకి వారికి ఆహ్వానం పంపించకపోయి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.