Valarmathi Passed Away: ఏదైనా అంతరిక్ష ప్రయోగాలకు ముందు రాకెట్ సన్నద్ధత పరీక్షలను నిర్వహిస్తారు. అవి పూర్తయిన తర్వాత కౌంట్‌డౌన్ చేపడతారు. ప్రయోగంలో ఇది అత్యంత కీలకం. ఈ సమయంలోనే ఏదైనా సమస్య ఉన్నా తెలుసుకుంటారు. ఇక, ఇస్రో రాకెట్ ప్రయోగ సమయంలో ఓ స్వరం గంభీరంగా వినిపిస్తుంది. ప్రయోగానికి ముందు కౌంట్‌డౌన్ సమయంలో ఓ మహిళ స్వరం అందర్నీ ఆకట్టుకునేది. మొన్న చంద్రయాన్–3 వరకూ వినిపించిన ఆమె వాయిస్.. ఇక శాశ్వతంగా మూగబోయింది.
గుండెపోటుతో చనిపోయిన ఇస్రో సైంటిస్ట్
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో రాకెట్ ప్రయోగాల సమయంలో తన గంభీరమైన స్వరంతో కౌంట్‌డౌ¯Œ విధులు నిర్వహించే ఉద్యోగిని వాలర్‌మతి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుకు గురైన ఆమె.. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. చంద్రయాన్–3 సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె కౌంట్‌డౌన్ బాధ్యతలు నిర్వర్తించారు. జులై 14న చంద్రయాన్–3 ప్రయోగమే ఆమెకు చివరిది కావడం బాధాకరం.
కౌంట్‌డౌన్ ఇలా..
ఉపగ్రహ ప్రయోగానికి 72 నుంచి 96 గంటల ముందు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కొన్ని ప్రీ–ఫ్లైట్ విధానాలు పూర్తవుతాయి. ఇందులో భాగంగానే రాకెట్‌కు ఉపగ్రహాన్ని అనుసంధానించడం, ఇంధనం నింపడం, సహాయక పరికరాలను పరీక్షించడం వంటి జరుగుతాయి. ఈ చెక్‌లిస్ట్ సహాయంతో ఉపగ్రహ షెడ్యూల్ సాఫీగా సాగుతుంది. ఈ సమయంలో ఏదైనా ఇబ్బంది లేదా సమస్య తలెత్తినా ప్రయోగాన్ని నిలిపివేస్తారు. ప్రయోగం ఎటువంటి ఆటంకం లేకుండా సాగడానికే కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్వహిస్తారు.
వాతావరణ పరిస్థితుల ఆధారంగా..
ప్రయోగ సమయంలో వాతావరణ పరిస్థితులను కూగా పరిగణనలోకి తీసుకుంటారు. కౌంట్‌డౌన్ మొదలైన తర్వాత వాతావరణం అనుకూలించకపోయినా ప్రయోగం ఆగిపోతుంది. ఆగస్టు 2013లో జీఎస్‌ఎల్వీ రాకెట్‌కు అమర్చిన క్రయోజెనిక్ ఇంజిన్ ను పరీక్షించే కౌంట్‌డౌన్ సమయంలో.. ప్రయోగానికి గంట 14 నిమిషాల ముందు లీక్ కనుగొన్నారు. దీంతో కౌంట్‌డౌన్ ముగించి, ప్రయోగాన్ని నిలిపివేశారు.
నాసాలో ఇలా..
నాసా సాధారణంగా ‘ఎల్–మైనస్’, ‘టీ–మైనస్’ అనే పదాలను రాకెట్ ప్రయోగానికి సన్నాహకంగా, కౌంట్‌డౌన్ సమయంలో ఉపయోగిస్తుంది. అలాగే, అంతరిక్షంలో ఇప్పటికే ఉన్న వ్యోమనౌకలున్న ఈవెంట్‌లకు ‘ఈ–మైనస్’ను పరిగణనలోకి తీసుకుంటింది. ‘టీ’ అంటే టెస్ట్ లేదా టైమ్.. ‘ఈ’ అంటే ఎన్ కౌంటర్.
స్లీపింగ్ మోడ్‌లో ప్రజ్ఞాన్..
మరోవైపు, జాబిల్లి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలో చంద్రుడిపై పగలు పూర్తయి.. చీకటి ముంచుకొస్తోంది. దీంతో రోవర్, ల్యాండర్‌ను ఇస్రో ముందుగానే నిద్రపుచ్చింది. అక్కడ రాత్రిపూట ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీలకుపైగా ఉండటం వల్ల సూర్యుని కాంతిని ఉపయోగించుకుని పనిచేసే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. అంత గడ్డగట్టే చలికి పనిచేయకుండా పోతాయి. ఈ నేపథ్యంలో ఇస్రో వాటిని స్లీప్ మోడ్‌లో ఉంచింది. 14 రోజుల రాత్రి పూర్తయి.. మళ్లీ సూర్యోదయం వచ్చినపుడు అవి స్లీప్ మోడ్ నుంచి బయటికి తీసుకొస్తారు.