క్రికెట్ సైన్స్ అయితే అతను అబ్దుల్ కలాం అంతటి గొప్ప శాస్త్రవేత్త..! ఇది సినిమా అయితే అతను అమితాబ్ బచ్చన్ అంతటి గొప్ప నటుడు..! ఈ ఆట ఓ తపస్సు అయితే అతనో మహా ఋషి.! ఇది ఓ సామ్రాజ్యం అయితే అతను మకుటం లేని మహారాజు..! ఇది ఓ కురుక్షేత్ర సంగ్రమాం అయితే అర్జునుడూ అతనే.. శ్రీకృష్ణుడూ అతనే..! ఆ దేవలోకానికి అధిపతి ఇంద్రుడు అయితే ఒకటిన్నర దశబ్దాల పాటు భారత క్రికెట్ కు అధిపతిలాంటి వాడు ఈ మహేంద్రుడు..! అతగాడి పూర్తి పేరు మహేంద్ర సింగ్ ధోనీ. పుట్టింది రాంచీ. ఏలింది భారత క్రికెట్ ను !
Also Read: సోము వీర్రాజు గేమ్ ప్లాన్ ఏమిటీ?
అనామకుడిలా వచ్చి అసాధ్యుడిగా ఎదిగిన ధోనీ.. దేశ క్రికెట్ గతి మార్చేసిన మొనగాడు..! సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలు ఒక్కొక్కరుగా ఆట నుంచి నిష్ర్కమణతో డీలా పడుతున్న జాతీయ జట్టును ప్రపంచంలోనే మేటిగా నిలిపిన వైతాళికుడు.! టీ20, వన్డే వరల్డ్ కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అందించి, టెస్టుల్లో ఇండియాను నంబర్ వన్‌గా నిలిపిన మేరునగధీరుడు.!! స్వాతంత్ర్య దినోత్సవం రోజు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చిన ధోనీ గురించి చెప్పేందుకు అంకెలు, రికార్డులు సరిపోవు. ఆటకు మించిన అతని వ్యక్తిత్వాన్ని పొగిడేందుకు మాటలు సరిపోవు.
అపర ప్రతిభాశీలి
ఎక్కడి రాంచీ.. ఎక్కడి వరల్డ్ కప్ విక్టరీ. ఒకప్పుడు క్రికెట్ అంటే ముంబై, బెంగాల్, ఢిల్లీ, హైదరాబాద్, కర్నాటక పేర్లే వినిపించేవి. దేశవాళీ క్రికెట్లో ఆయా జట్లకుప్రాతినిథ్యం వహించిన వాళ్లే జాతీయ జట్టుకు ఎక్కువ మంది ఆడేవాళ్లు. జార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రాల్లో క్రికెట్కు అంతగా ప్రాముఖ్యత ఉండేది కాదు. ఆ రాష్ట్ర రంజీ జట్టు కూడా ఒకటి ఉందని చాలా మంది గుర్తించే వాళ్లు కాదు. అలాంటి చోటు నుంచి ఒకడు భారత జట్టులోకి రావడమే అనూహ్యం. కానీ, ధోనీ వచ్చాడు. ఆటగాడిగా, నాయకుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ దేశ క్రికెట్పై చెరగని ముద్ర వేశాడు. తన ప్రతిభతో, పోరాట స్పూర్తితో, నాయకత్వ పటిమతో పుట్టిన రాంచీకే కాదు యావత్ దేశానికి పేరు తెచ్చిన ప్రతిభాశీలి అతను. తన వ్యక్తిత్వం మాదిరిగా ధోనీ ఆట కూడా విలక్షణమే. అతని బ్యాటింగ్ కానీ, కీపింగ్ శైలి కానీ అంత అందంగా ఉండదు. సచిన్, కోహ్లీలా పుస్తకాల్లోని షాట్లు ఆడడు. క్లాసిక్ డ్రైవ్‌లు కొట్టలేడు. భుజ బలం, బుద్ధిబలమే ఉపయోగిస్తాడు. తాను సిక్సర్ కొట్టాలనుకుంటే ఎలాంటి బంతినైనా స్టాండ్స్‌లోకి పంపేస్తాడు. కీపింగ్‌లోనూ అంతే. ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లా అమాతం డైవ్ చేయలేడు. కానీ, ధోనీ వికెట్ల వెనకాల ఉంటే బంతి అతడిని దాటి వెళ్లదు. బ్యాట్స్‌మెన్ క్రీజు దాటాడంటే రెప్పపాటులో స్టంపౌంట్ చేస్తాడు. అల్లంత దూరంలో ఉన్న వికెట్లను చూడకుండా రనౌట్ చేసేస్తాడు.
నిగర్వి.. నిస్వార్థి
సచిన్ టెండూల్కర్ అంతటి పేరుంది. సౌరవ్ గంగూలీలా జాతీయ జట్టులో ఎదురేలేదు. అయినా సరే ధోనీలో మీసమెత్తు గర్వం కనిపించదు. ఒకటిన్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఒక్కసారి కూడా పొగరు గా వ్యవహరించిన సందర్భం లేదు. అతని నోటి నుంచి అనవసరంగా వచ్చిన మాట లేదు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ధోనీ అందరికీ విలువ ఇస్తాడు. తాను కెప్టెన్ అయిన కొత్తలో గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్, లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ లాంటి సీనియర్లకు గౌరవం ఇచ్చాడు. సత్తా ఉన్నంతకాలం వాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణం కలిపించాడు. కానీ, వయసు పెరిగి, పరుగులో వేగం తగ్గి, ఆటలో పదును తగ్గిన వెంటనే వాళ్లు మాకొద్దు అనేశాడు. ప్రపంచ క్రికెట్‌లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా జట్టును తీర్చిదిద్దాలని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడు. దూరదృష్టితో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చాడు. అప్పుడు కుర్రాళ్లుగా ఉన్న కోహ్లీ, రోహిత్, జడేజా, రైనా, భువనేశ్వర్, శిఖర్ధవన్, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యాలను తెరపైకి తీసుకొచ్చింది అతనే. వీళ్లంతా ధోనీ కెప్టెన్సీలో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లు కొన్నిసార్లు విఫలమైనా వెన్నుతట్టి ప్రోత్సహించి వాళ్లను వరల్డ్ క్లాస్ ప్లేయర్లుగా తీర్చిదిద్దాడు మహీ. జట్టు కోసం తన బ్యాటింగ్ స్టయిల్‌ను, బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకున్న నిస్వార్థి అతను. మూడు, నాలుగులో మంచి రికార్డు ఉన్నప్పటికీ మిడిలార్డర్కు మారి విజయాలు అందించాడు.
Also Read: తహసీల్దార్ కోటి లంచంలో రేవంత్ రెడ్డికి లింక్?
సీతయ్య.. అనుకున్నదే చేస్తాడు
ధోనీ అందరి అభిప్రాయాలను గౌరవిస్తాడు. జట్టులో ఎవరైనా సరే తన దగ్గరకి వచ్చి సలహాలు ఇచ్చే స్వేచ్ఛనిచ్చాడు. కానీ, తాను అనుకున్నదే చేస్తాడు. సీతయ్య టైప్. తాను ఏదైనా చేయాలని మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతాడు. తన సామర్థ్యంపై అతనికున్న నమ్మకం అలాంటిది మరి. ఆటలో అతనిది మాస్టర్ మైండ్. 22 గజాల పిచ్‌ను.. 80 మీటర్ల మైదానాన్నే కాదు ప్రత్యర్థి ఆటగాళ్ల మైండ్‌ను చదివేశాడు. ఓ బ్యాట్స్మెన్ ఏ టైమ్‌లో ఎలాంటి షాట్ ఆడతాడో, ఓ బౌలర్ ఎలాంటి బంతిని వేస్తాడో అతనికి ముందుగానే తెలిసిపోతుంది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తాడు. ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తాడు. ఇప్పటికీ ఎంతో మందికి బ్రహ్మపదార్థం లాంటి డీఆర్ఎస్‌పై అయితే అతను పీహెచ్డీ చేశాడని చెప్పొచ్చు. ధోనీ రివ్యూ కోరాడంటే దాదాపు 90 శాతం కచ్చితవ్వం ఉంటుంది. అందుకే డీఆర్ఎస్ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్ అని పేరొచ్చింది. జట్టుకు ఏది మంచిదో, ఏ టైమ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మహీకి బాగా తెలుసు. ఒక వరల్డ్ కప్ ముగిసిన వెంటనే నాలుగేళ్ల తర్వాత జరిగే మరో ప్రపంచ కప్ కోసం ప్రణాళికలు రచిస్తాడతను. ఎప్పుడేం చేయాలో అతనికున్న క్లారిటీ మరెవరికీ లేదు.
దటీజ్ ధోనీ..
జట్టుకు పట్టుకొని వేళాడే రకం కాదు ధోనీ. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొందరు సీనియర్లను సాగనంపిన మహీ కుర్రాళ్లకు దారిచ్చేందుకు తానూ అదే పని చేశాడు. ఇండియాకు తర్వాతి కెప్టెన్ కోహ్లీ అని అర్థమవగానే టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఆపై, లిమిటెడ్ ఓవర్ల పగ్గాలు అతనికే ఇచ్చేసి ఓ ప్లేయర్గా జట్టులో కొనసాగాడు. ఓ పెద్దన్నలా విరాట్‌కు సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఈ లోపు వయసు మీద పడి, గాయాలు ఎదురై ధోనీ ఆటలో మునుపటి వాడి తగ్గింది. 2015 వన్డే వరల్డ్ కప్, 2016 టీ 20 వరల్డ్ కప్ ఓటముల తర్వాత నుంచే ధోనీ రిటైరవ్వాలన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. కానీ, కీపర్గా తన స్థానాన్ని భర్తీ చేసే సరైన ఆటగాడు లేకపోవడం, 2019 వరల్డ్కప్ ఇండియాకు అందించాలన్న లక్ష్యంతోనే రాంచీ వీరుడు కొనసాగాడు. కానీ, గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్‌కప్ సెమీస్‌లోనే మన జట్టు ఓడిపోయింది. అతని రనౌట్‌తోనే ఇండియా కప్పు కల చెదిరింది. మైదానంలో మొదటిసారి ధోనీ కంట కన్నీరు కనిపించింది. ఇది జరిగి ఏడాది పూర్తయింది. ధోనీ మళ్లీ గ్రౌండ్‌లో కనిపించలేదు. అప్పటి నుంచి ధోనీ వీడ్కోలు పలకాల్సిందే అని కొందరు డిమాండ్ కూడా చేశారు. కానీ, ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆడాలనుకున్నాడు మహీ. కారణం లిమిటెడ్ ఓవర్లలో మంచి కీపర్లేకపోవడమే. కానీ, ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ వాయిదా పడింది. ఇప్పుడు జట్టుకు తన అవసరం లేదని అతనికి అర్థమైంది. అందుకే ఓ రాత్రి ఓ చిన్న మెసేజ్‌తో తన కెరీర్కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేశాడు. దటీజ్ ధోనీ. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ వల్లే మహీ రిటైర్మెంట్ ఇచ్చాడని పలువురు భావిస్తున్నారు. కానీ, ఒకరి కారణంగానో.. ఒకరు చెబితేనో వైదొలగాలని అనుకుంటే ధోనీ ఇప్పటికి వంద సార్లు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చేది. ఫేర్వెల్ మ్యాచ్ ఆడించాల్సిందని, సచిన్ మాదిరిగా సగర్వంగా సాగనంపాలని ఎన్ని అభిప్రాయాలు వస్తున్నా.. మహీ ఒప్పుకుంటేనే అది సాధ్యం అవుతుంది. ఇలాంటి హడావుడి ధోనీకి నచ్చదు. అతనెప్పుడూ కూల్‌గానే ఉంటాడు. ఏపనైనా కూల్‌గానే చేస్తాడు. ఎందుకంటే అతను మహేంద్రుడు..!