మన దేశంలో ప్రతి సంవత్సరం చనిపోతున్న జవాన్ల జాబితాను పరిశీలిస్తే యుద్ధాలలో పాల్గొని చనిపోతున్న వారితో పోల్చి చూస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న జవాన్ల జాబితానే ఎక్కువగా ఉంది. ఎక్కువ శాతం మంది జవాన్లు ఆత్మహత్య చేసుకోవడానికి ఒత్తిడి, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలని తెలుస్తోంది. థింక్ ట్యాంక్ యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసి భారత జవాన్లకు సంబంధించిన ఈ విషయాలను వెల్లడించింది.
అధ్యయనంలో ప్రతి మూడు రోజులకు ఒకరు చొప్పున సంవత్సరానికి 100 మందికి పైగా సైనికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వెల్లడైంది. కర్నల్ ఏకే మోర్ సైనికుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఉగ్రవాదులతో పోరాటం చేస్తున్న సమయంలో సైనికులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని ఆయన వెల్లడించారు. సైనికులలో ఒత్తిడి పెరగడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
సైనికులకు మొబైల్ ఫోన్ల వాడకంలో ఉండే నియమనిబంధనలు, ఉన్నతాధికారుల నుంచి ఎదురయ్యే అవమానాలు, ఇంటి సమస్యలు, సైనికుల సమస్యలకు అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం, ఇతర కారణాలు ఉంటాయని తెలుస్తోంది. యూఎస్ఐ అధ్యయనంలో ఈ కారణాల వల్లే ఎక్కువ మంది సైనికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని.. సైనికుల ఆత్మహత్యలకు ఇవే ప్రధాన కారణాలని చెబుతోంది.
ఆపరేషన్, నాన్ ఆపరేషన్లు కూడా ఒక విధంగా సైనికుల్లో ఒత్తిడి పెరగడానికి కారణమని సమాచారం. జవాన్లకు అక్కడ ఉండే పరిస్థితులు కూడా ఒక విధంగా ఒత్తిడికి కారణమని తెలుస్తోంది. సైన్యంలోని దాదాపు సగం మంది ఒత్తిడికి లోనవుతూ ఉండగా కొంతమంది మాత్రం తీవ్రమైన ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.