Montha Cyclone: ఏపీతో( Andhra Pradesh) పాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర హెచ్చరిక. బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ ఏర్పడబోతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర అల్పపీడనం ఈ మధ్యాహ్నానికి వాయుగుండంగా మారబోతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. సోమవారం నాటికి తుఫాన్ గా మారనుంది. దీనికి మోంథాగా నామకరణం చేశారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఈనెల 27 నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
* కేంద్రం అప్రమత్తం..
తీవ్ర తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం( central government) అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 26న తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లోని కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 27న సైతం తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* ఈ రాష్ట్రాలకు హెచ్చరిక..
అయితే ఈ భారీ తుఫాను మరింత బలపడితే మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందికరమే. అందుకే ఈ బలమైన తుఫాన్ కు మోంథాగా(monthaa) నామకరణం చేశారు. ఈ తుఫాన్ కు థాయిలాండ్ ఈ పేరును సూచించింది.మోంథా అంటే థాయ్ భాషలో సువాసన లేదా అందమైన పువ్వు అని అర్థం. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మాయన్మార్, ఒమన్,, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 13 సభ్య దేశాలతో కూడిన ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ ద్వారా ఈ పేర్లను సూచిస్తారు. అయితే అతి తీవ్రత కలిగిన తుఫానులకు ఈ పేరు పెట్టడం వల్ల ప్రజలు సులువుగా అప్రమత్తమవుతారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నియంత్రించవచ్చు.