Manipur Incident : సుమారు రెండున్నర నెలల నుంచి హింసాత్మక సంఘటనకు వేదికగా మారిన మణిపూర్ లో.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణ సంఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ వై చంద్రచూడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్టు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రకటించారు. ఈ దారుణానికి బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని, మరణ శిక్ష విధించేందుకు సైతం వెనుకాడది లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి మణిపూర్ రాష్ట్రంలో కుకి, మెయిటీ ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆ రెండు తెగల మధ్య గొడవలు జరగడంతో మెయిటీలు ఇద్దరు కుకీ మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి
మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ పరిస్థితి పై మాట్లాడాలి. లేకుంటే పార్లమెంట్లో జరిగే అంతరయాలకు ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది. మన్ కీ బాత్ ఇక చాలు. మణిపూర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది” అని టీఎంసీ పార్లమెంట్ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ వీడియో సందేశం విడుదల చేశారు. మరో వైపు ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తుతామని ఆయన ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ లో చెప్పారు. తాము మణిపూర్ అల్లర్లపై వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ అల్లర్లపై మౌనంగా ఉన్నారని ఆయన విమర్శించారు.. మోడీకి ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసేందుకు సమయం ఉంది, మణిపూర్ వెళ్లేందుకు లేదా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రధాని ఏమన్నారంటే
మహిళలకు జరిగిన అవమానంపై స్పందించాలని ఒత్తిడి చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఉదయం పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు. “అమానుష సంఘటన తీవ్రంగా కలచివేసింది. తీవ్రంగా బాధ పెట్టింది. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు నా మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయి. ఏ నాగరికతకైనా ఈ సంఘటన సిగ్గుచేటు. ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఇందుకు వీలుగా కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాలను రూపొందించాలి. ఇటువంటి సంఘటనలో రాజస్థాన్లో జరిగినా, చతిస్గడ్ లో జరిగినా నిందితులు తప్పించుకోకూడదని” అన్నారు.
రాజ్యాంగాన్ని అవమానపరచడమే
కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనపై సుప్రీంకోర్టు స్వీయ విచారణకు చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ వై చంద్రచూడ్ ఈ దారుణంపై స్పందించారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మతపరమైన ఘర్షణ చెలరేగే ప్రాంతంలో మహిళలను సాధనంగా ఉపయోగించుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం రాజ్యాంగాన్ని తూలనాడటమే అన్నారు. సామాజిక మాధ్యమాల్లో బయటపడిన వీడియోలు తనను తీవ్రంగా కలిచి వేశాయన్నారు. దీనిపై తాము తీవ్రంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మరణశిక్ష విధిస్తాం
మరోవైపు ఈ సంఘటనపై మణిపురం ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్పందించారు. ఇటువంటి అమానుష చర్యలకు ఎంత మాత్రం చోటు లేదన్నారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్టు ఆయన ప్రకటించారు. సామాజిక మాధ్యమాల ద్వారా బయటపడిన వీడియోలు తన మనసును కలచి వేశాయన్నారు. ఈ దారుణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన ప్రకటించారు. అన్నిందితులకు మరణ శిక్ష విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. కాగా ఈ దారుణం నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.