https://oktelugu.com/

Ahmedabad: ఉన్మాదం తారాస్థాయికి చేరితే.. ఇలాంటి అనర్ధాలే జరుగుతాయి

అహ్మదాబాద్ ప్రాంతంలో ఓ యూనివర్సిటీకి వారి చదువుకు సంబంధించిన పని నిమిత్తం ఆఫ్రికా, తుర్కుమేనిస్తాన్, ఇంకా కొన్ని దేశాలకు చెందిన ముస్లిం యువకులు వచ్చారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 19, 2024 / 11:35 AM IST

    Mob targets Gujarat University foreign students during namaz

    Follow us on

    Ahmedabad: కుండ నిండా స్వచ్ఛమైన పాలల్లో రెండంటే రెండే విషపు చుక్కలు పోస్తే ఎలా ఉంటుంది. పాలు మొత్తం విరిగిపోతాయి. అలాగే వనం నిండా తులసి మొక్కలు ఉండి. నాలుగు లేదా ఐదు గంజాయి మొక్కలు వేస్తే.. ఆ వనం మొత్తం నాశనమవుతుంది. అలాగే దేశం మొత్తం మంచి వాళ్ళే ఉండి.. కొంతమంది మూర్ఖులు అతి చేస్తే.. ఆ చెడ్డపేరు మొత్తం దేశానికి వస్తుంది. ప్రస్తుతం అలాంటి పరిణామాలే మన దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. ప్రపంచం ముందు తల వంచుకొనేలా చేస్తున్నాయి.
    మనది భిన్నత్వంలో ఏకత్వం లాంటి దేశం. అతిథులను అత్యంత గౌరవించే దేశం. అలాంటి దేశంలో మొన్న స్పెయిన్ ప్రాంతానికి చెందిన ఓ యువతి పై కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. అయినప్పటికీ ఆ యువతి భారత్ పై సదాభిప్రాయాన్నే వ్యక్తం చేసింది.. తాజాగా అహ్మదాబాద్ ప్రాంతంలో నమాజ్ చేసుకుంటున్న యువకులపై కొంతమంది దుండగులు దాడి చేశారు. వారు వాడుతున్న సెల్ ఫోన్లు, లాప్టాప్ లో ధ్వంసం చేశారు. వారిని దూషించారు.

    అహ్మదాబాద్ ప్రాంతంలో ఓ యూనివర్సిటీకి వారి చదువుకు సంబంధించిన పని నిమిత్తం ఆఫ్రికా, తుర్కుమేనిస్తాన్, ఇంకా కొన్ని దేశాలకు చెందిన ముస్లిం యువకులు వచ్చారు. అక్కడ యూనివర్సిటీలోని హాస్టల్లో ఉంటున్నారు. అయితే వారు తమ మత సంప్రదాయం ప్రకారం నమాజ్ చేసుకుంటుండగా.. కొంతమంది అడ్డుకున్నారు. నమాజ్ మసీదులోనే చేసుకోవాలని.. హాస్టల్లో కుదరదని హుకుం విధించారు. దీంతో ఆ ముస్లిం యువకులకు, ఆ దుండగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం తోపులాటకు దిగాయి. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. వారిలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మరి కొంతమంది పరారీలో ఉండటంతో వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

    వాస్తవంగా ఇలాంటి ఘటనలు దేశం పరువు తీస్తాయి. స్పెయిన్ అమ్మాయిపై అత్యాచారం జరిగిన విషయాన్ని మర్చిపోకముందే.. అహ్మదాబాద్ లో ఓ మతానికి చెందిన విద్యార్థులపై దాడులు జరగడం కలకలం రేపుతోంది. వాస్తవానికి మన దేశానికి ప్రతి ఏడాది కోట్లల్లో పర్యాటకులు వస్తుంటారు. వారి ద్వారా భారీగానే ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి ఘటనల వల్ల దేశం పరువు పోతుంది. కొంతమంది మూర్ఖులు చేస్తున్న పని వల్ల దేశం నగుబాటుకు గురవుతోంది. అలాంటి వారిపై ప్రభుత్వం ఎంత తొందరగా చర్యలు తీసుకుంటే అంత మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.