Homeజాతీయ వార్తలుJamili Elections: వ్యూహం మార్చిన కమలం.. జమిలి ఎన్నికలకు సమాయత్తం!?

Jamili Elections: వ్యూహం మార్చిన కమలం.. జమిలి ఎన్నికలకు సమాయత్తం!?

Jamili Elections: రోజు రోజుకీ రాజకీయ పార్టీలలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. ఈ ఏడాది చివరన జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలతోపాటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ సమాతయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ వ్యూహం మర్చినట్లు కనబడుతోంది. మినీ జమిలి ఎన్నికలకు కమలనాథులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.

ఏపీలో ముందస్తుపై ఊహాగానాలు..
తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏపీలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావచ్చని, తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలతోపాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు ప్రధానిని కలిశారు. మోదీని కలిసి బయటికి వచ్చిన కాసేపటికే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిపించాల్సిందిగా నరేంద్ర మోదీని ఏపీ సీఎం కోరారంటూ జాతీయ మీడియాలో ఓ లీకేజీ వచ్చింది. దీనిని ఓ జర్నలిస్టు ట్వీట్‌ చేయడంతో హడావుడి మొదలైంది. ట్వీట్‌ ఆధారంగా తెలుగు న్యూస్‌ ఛానల్స్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ ప్రారంభించాయి. అయితే కాసేపటికే ఏపీలో ముందస్తు యోచన లేదంటూ జగన్‌ వెంటే ఢిల్లీ పర్యటనలో ఉన్న వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి మీడియా ప్రతినిధులకు కాల్‌ చేసి చెప్పారు. మరి నిప్పు లేకుండానే ఈ పొగ బయటికి వచ్చిందా ? అసెంబ్లీని ముందుగానే రద్దు చేసి, అయిదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు ఎన్నికలకు వెళ్లాలని ఏపీ సీఎం జగన్‌ మదిలో వుందా? లేదా ? లేకుండానే ఈ లీకేజీ ఎలా వచ్చింది? ఈ అంశాలు కాసేపు గందరగోళం కలిగించాయి. అధినేతల అంతరంగాన్ని వారు తమ దగ్గరి వారితో మీడియాకు లీకు చేయిస్తేనేగానీ నిజం వెలుగులోకి రాదు.

బీజేపీ వ్యూహంలో భాగమేనా..?
నిజానికి ఏపీలో ముందస్తు ఉండొచ్చన్న ఊహాగానాలు రావడం ఇదే మొదటి సారి కాదు. ఆరు నెలలుగా ఈ మేరకు ఏదో ఒక పత్రిక కథనాలు రాస్తూనే ఉంది. అయితే తాజాగా జగన్, మోదీ భేటీ తర్వాత ఈ మేరకు లీకేజీ రావడం యాదృచ్ఛికమైతే కాదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యూహ రచన కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత మారింది. ఇటీవల విపక్షాలు కొత్తగా కూటమి కట్టేందుకు పాట్నాలో భేటీ నిర్వహించడం, దానికి 17 పార్టీలు హాజరు కావడం, మలి విడత సమాలోచనలు బెంగళూరు సిటీలో జులై 14, 15 తేదీలలో జరపనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పంథా మార్చిందనే చెప్పాలి. కొత్త ఆలోచనలు అమలు చేయడం ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలతో కూడా బీజేపీ వ్యవహార శైలిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. మే నెల కంటే ముందు తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయిలో ఉంది. కానీ గత రెండు నెలలుగా ఈ రెండు పార్టీల మధ్య మాటల మంటలు గతంలోలాగా లేవు. అధికార బీఆర్‌ఎస్‌ కీలక నేతలు కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడుతున్నారు. అడపాదడపా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. కాంగ్రెస్‌ పార్టీని దుయ్యబడుతున్నారు.

ఏపీలో తేలని పొత్తులు..
అటు ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ ఫ్రెండ్షిప్‌ ఖాయమన్న ప్రచారం కూడా సడన్‌గా ఆగిపోయింది. వైసీపీకే అక్కడ బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలపై కేంద్రం కూడా మెతకవైఖరి అవలంబిస్తోంది. దీని వెనుక సుదీర్ఘ వ్యూహం ఉందన్న చర్చ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది.

మినీ జమిలి దిశగా..
ఇంతకీ సీఎం జగన్‌ స్వయంగా ప్రధాని ముందు ఏపీకి ముందస్తు అన్న అంశాన్ని లేవనెత్తారా? లేక బీజేపీనే లోక్‌సభకు ముందస్తు ఎన్నికల వ్యూహ రచన చేస్తుందా అన్నది కూడా కొందరి అనుమానం. ఎందుకంటే 2023 ఎండింగ్‌లో అయిదు(తెలంగాణ, మిజోరం, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్‌), వచ్చే సంవత్సరం లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు (సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌), 2024 చివరిలో మరో మూడు (హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌) రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే ఏడాది వ్యవధి(నవంబర్‌ 2023–నవంబర్‌ 2024 మధ్య) మొత్తం 12 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. కేంద్రం ఒకవైపు జమిలి ఎన్నికల ఆలోచన చేస్తోంది. వీటిలో ఏడు రాష్ట్రాలు పెద్దవి, మిగిలినవి చిన్న రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలలో మెరుగైన ఎంపీ సీట్లు సాధించడం బీజేపీకి అత్యంత అవసరం. ఈక్రమంలో 2024 ఏప్రిల్, మేలో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలను కాస్త ముందుకు అంటే రెండు, మూడు నెలల ముందుకు జరిపితే.. దానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సానుకూలంగా స్పందిస్తే.. 9 రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 ఎండింగ్‌లో ఎన్నికలు జరగాల్సిన మూడు రాష్ట్రాల్లో రెండింటిలో(మహారాష్ట్ర, హర్యానాలో) బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం జమిలి ఎన్నికలను ప్లాన్‌ చేస్తే ఆ రెండు రాష్ట్రాలు కూడా అసెంబ్లీలను రద్దు చేసి.. 2024 జనవరి, ఫిబ్రవరి లో ఎన్నికలకు రెడీ అవ్వొచ్చు. ఇక బీజేపీతో వైరమున్న జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఆ రాష్ట్రంలో ముందస్తుకు ఏ మేరకు సహకరిస్తుందో ఇప్పుడే చెప్పలేం. కానీ 11 రాష్ట్రాలు ముందుకొస్తే, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన మినీ జమిలి ఎన్నికల వ్యూహంలో భాగంగా బీజేపీ హైకమాండ్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 జనవరి, ఫిబ్రవరిలో మినీ జమిలి ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రధాని మోదీ, అమిత్‌షా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular