Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని భక్తులు భావిస్తారు. ఏటా కోట్లాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. మొదట్లో శ్రీవారికి వార్షిక ఆదాయం ఏడాదికి లక్షకు మించేది కాదు. అలా రోజురోజుకు పెరుగుతూ వస్తున్న శ్రీవారి హుండీ ఆదాయం మొదటిసారిగా 1958, నవంబర్ 28న లక్ష రూపాయలు దాటింది. గత కొన్ని మాసాలుగా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభిస్తోంది. ఇప్పిటకే ఈ ఏడాది శ్రీవారికి లభిస్తున్న హుండీ ఆదాయం ప్రతినెలా 100 కోట్ల మార్కును దాటగా జూన్‌లో రూ.116 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఇప్పటికే ఈ ఏడాదిలో శ్రీవారికి హుండీ ద్వారా 700 కోట్లు ఆదాయం లభించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వస్తున్న రెండో క్షేత్రంగా తిరుమల నిలిచింది.
ఏటా రూ.1,500 కోట్ల ఆదాయం..
కొద్దినెలలుగా స్వామివారికి భక్తులు సమర్పిస్తున్న కానుకలు చూస్తుంటే ఈ ఏడాది స్వామివారి హుండీ ఆదాయం రూ.1,500 కోట్లకుపైగా లభించే అవకాశం కనిపిస్తుంది. భక్తులు తమతమ మొక్కులు తాహతను బట్టి శ్రీవారికి కానుకలు సమ ర్పిస్తుంటారు. మరికొందరు భక్తులైతే స్వామివారికి నిలువుదోపిడీ సమర్పిస్తారు.
వేలు, లక్షలు, కోట్లు..
ఇలా శ్రీవారికి భక్తులు సమర్పించేకానుకలు గతంలో వేలలో అటు తరువాత లక్షల్లో ఉండగా నేడు కోట్లకు చేరుకుంది. గతంలో శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య వందల్లో ఉండగా కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరుగుతూ లక్షల్లోకి చేరుకుంది. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ స్వామివారి హుండీ ఆదాయం పెరుగుతూ వస్తుంది.
కోట్లకు చేరిన ఆదాయం..
1958లో తొలిసారి లక్ష వార్షిక ఆదాయం రాగా, 1985 వరకు లక్ష రూపాయలలో ఆదాయం కొనసాగింది. 1990లో అది కోటి రూపాయలకు చేరుకుంది. 2000 సంవత్సరంలో శ్రీవారికి హుండీ ద్వారా 137 కోట్ల రూపాయలు ఆదాయం లభించగా, 2010లో రూ.521 కోట్లు 2022లో రూ.1,500 కోట్లకి చేరుకుంది.
ఈ ఏడాది నెలకు రూ.కోటి..
ఇక ఈ ఏడాది శ్రీవారికి ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా ఆదాయం హుండీద్వారా వస్తుంది. జనవరి నెలలో 123 కోట్ల 4 లక్షల రూపాయలు లభిస్తే ఫిబ్రవరిలో రూ.114 కోట్ల 29 లక్షల ఆదాయం లభించింది. మార్చిలో రూ.120 కోట్ల 29 లక్షలు ఆదాయం లభిం చగా ఏప్రిల్ నెలలో రూ.114 కోట్ల 18 లక్షల ఆదాయం లభించింది. మే నెలలో 110 కోట్ల 2 లక్షల రూపాయలు ఆదాయం లభిస్తే జూన్‌లో 116 కోట్ల 14 లక్షల రూపాయల ఆదాయం శ్రీవారికి లభించింది. ఇలా ఇప్పటికే ఆరు నెలలకు శ్రీవారికి 697 కోట్ల 96 లక్షల రూపాయలు ఆదాయం లభించింది. దీంతో వరుసగా రెండవ ఏడాది శ్రీవారికి హుండీ ఆదాయం 1500 కోట్ల మార్కును దాటే అవకాశం కనిపిస్తోంది.