దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ప్రభావం విద్యారంగంపై అధికంగా పడిన సంగతి తెలిసిందే. కరోనా భయం ప్రజలను గగజా వణికిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు సుముఖంగా లేరు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి పాఠశాలలను కరోనా నిబంధనలను పాటిస్తూ తెరుచుకోవచ్చని చెబుతోంది. అయితే కేంద్రం విద్యా సంస్థలకు అనుమతిచ్చినా పాఠశాలలు తెరుచుకునే పరిస్థితులు కనిపించడం లేదు.
చాలా రాష్ట్రాలు ఇప్పటికే భౌతికంగా పాఠశాలలను తెరవకూడదని ఆన్ లైన్ క్లాసుల ద్వారా మాత్రమే బోధన జరగాలని భావిస్తున్నాయి. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ ప్రభుత్వాలు అక్టోబర్ 15న పాఠశాలలను తెరిచే ఉద్దేశం తమకు లేదని కీలక ప్రకటన చేశాయి. మేఘాలయ, హర్యానా ప్రభుత్వాలు పరిస్థితులను అంచనా వేసి పాఠశాలలను తెరవాలా..? వద్దా..? అనే విషయం గురించి కీలక నిర్ణయం తీసుకుంటామని వెల్లడిస్తున్నాయి.
పాఠశాలలు తెరిచినా 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు మాత్రమే క్లాసులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పాఠశాలలను తెరవడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా విద్యార్థుల తలిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు సుముఖంగా లేరు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు టీచర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.
కేంద్రం పాఠశాలలను తెరిచేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తోందని ఆ నిబంధనలు పాటించడం అంత తేలిక కాదని టీచర్లు వాపోతున్నారు. తరగతి గదులను తరచూ శానిటైజ్ చేయడం, విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చేయడం ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారికి సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాటు పరిస్థితులు మెరుగుపడితే పాఠశాలలు తెరవడం మంచిదని సూచనలు వ్యక్తమవుతున్నాయి.