America- India: ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు పేదరికం గీటు రాయి గా అమలయ్యేవి.. ప్రభుత్వాలు అప్పట్లో ఈ సంక్షేమం మంత్రం పఠించేందుకు ప్రధాన కారణం.. సమాజంలో పేదలు ఎక్కువగా ఉండడం, ఆర్థిక తారతమ్యాన్ని రూపుమాపడం. కానీ రాను రాను ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల సంక్షేమ పథకాల పేరుతో పార్టీలు ఓటర్లకు గాలం వేయడం ప్రారంభించాయి. ఓటర్లు చేజారి పోకుండా ఉండేందుకు మరిన్ని కొత్త కొత్త పథకాలు తెరపైకి తీసుకొచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే సంక్షేమం పేరుతో ప్రభుత్వ ఖజానాను పప్పు బెల్లాల మాదిరి పంచిపెట్టడం మొదలుపెట్టాయి.. దీనివల్ల ఖజానా వట్టి పోవడం మొదలైంది. అప్పులు తేవడం ప్రారంభమైంది. అప్పులు కూడా ఇప్పుడు పరిమితి దాటిపోవడంతో సర్కార్ భూములను అడ్డగోలుగా అమ్మే కాడికి వచ్చింది. చదువుతుంటే వెనిజులా దేశం గుర్తుకు వస్తోంది కదూ.. ఇప్పుడు మన దేశం కూడా త్వరలో వెనిజులాను దాటిపోయి అమెరికాలాగే మారే రోజులు ఎంతో దూరంలో లేవు.
పనిచేసేందుకు ఇష్టపడటం లేదు
పూర్వ రోజుల్లో ఏదైనా పని ఉందంటే దానిని చేసేందుకు చాలా మంది ముందుకు వచ్చేవారు. అప్పుడు కూలి రేట్లు కూడా తక్కువగానే ఉండడంతో చేయాల్సిన పని ఆగేది కాదు. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం కూడా మందగించేది కాదు. ధరలు కూడా నియంత్రణ స్థాయిలో ఉండేవి. ఫలితంగా జనజీవనం సాఫీగా సాగేది. కానీ ప్రభుత్వాలు ఎప్పుడైతే సంక్షేమం పేరుతో పంచుడు పథకాలు ప్రారంభించాయో అప్పుడే ఆర్థిక చక్రం గతి తప్పింది. వస్తు సేవలకు డిమాండ్ ఏర్పడింది. పని చేసేవారు తక్కువ అవడంతో ఉత్పత్తి సామర్థ్యం మందగించింది. ఫలితంగా దిగుమతులు అనివార్యమైపోయాయి. దిగుమతులు అంటే ఊరికే రావు, వాటికి వివిధ రకాల పన్నులు చెల్లించాలి కాబట్టి ధరల స్థాయి అనివార్యంగా పెరిగింది. అంటే ప్రభుత్వాలు ఉదారంగా డబ్బులు ఇవ్వడం వల్ల జనాల్లో సోమరితనం అనేది పెరిగిపోయింది. ప్రభుత్వం ఏదో ఒక రూపంలో డబ్బులు ఇస్తుండడంతో జనానికి పనిమీద మోజు తగ్గింది. దీనివల్ల పనిచేసేవారు తక్కువయ్యారు. అలాంటప్పుడు కూలీల రేటు కూడా అనివార్యంగా పెరిగిపోయింది. ఇదే సమయంలో వస్తు సేవల డిమాండ్ గరిష్ట స్థాయిని అందుకుంది. దీనిని కనుక క్రమబద్ధీకరించని పక్షంలో భవిష్యత్తులో చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మనం కూడా అమెరికా లాగే
ప్రపంచానికి సాంకేతిక పాఠాలు చెప్పే అమెరికాలో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి కొత్త ఒరవడి సృష్టిస్తున్నాయి. వీటి ఫలితంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఒక సర్వే నివేదిక ప్రకారం అమెరికాలో గత మూడు సంవత్సరాలుగా సాంకేతికంగా వచ్చిన మార్పుల వల్ల సుమారు మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దీనంతటికీ కారణం అక్కడి ప్రభుత్వాలు ఒకప్పుడు వల్లే వేసిన సంక్షేమ మంత్రమే. దాని వల్ల జనాల చేతిలో అయాచితంగా డబ్బులు ఉండడంతో పనులు చేసేవారు తగ్గిపోయారు. దీనివల్ల వస్తు సేవలకు డిమాండ్ ఏర్పడింది. దీని అంతరాన్ని తగ్గించుకునేందుకు సాంకేతిక రంగ నిపుణులు కొత్త కొత్త మార్గాలు అన్వేషించారు. అందులో భాగమే ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. దీనివల్ల యంత్రాలు పనిచేస్తున్నాయి. చాలామంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇప్పుడు మనదేశంలో కూడా సంక్షేమం వల్ల జనాల చేతిలో డబ్బులు ఊరకనే వచ్చి పడుతున్నాయి. దీనివల్ల సోమరితనం పెరిగిపోయి పని చేసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు.. దీనివల్ల అనివార్యంగా యంత్రాలతో పనిచేయాల్సి వస్తోంది. అది అంతిమంగా నిరుద్యోగ రేటుకు కారణమవుతోంది.
ఏమిటి పరిష్కార మార్గం
కళ్ళముందే మనకు వెనిజులా దేశం కనిపిస్తోంది. ఇక్కడి పాలకులు ఎడాపెడా నిధులు ఖర్చు చేయడం వల్ల, సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల ఆర్థిక చక్రం గతి తప్పింది. ఫలితంగా దేశం ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. మనం కూడా అలాంటి పరిస్థితిలోకి దిగజారకముందే మేల్కోవాలి. సంక్షేమం అనేది లక్షిత వర్గాలకు చేరేలాగా ప్రభుత్వాలు రూపకల్పన చేయాలి. ప్రజలకు జీవన భృతి కల్పించడం మంచిదే అయినప్పటికీ.. అన్నీ కాళ్ళ ముందుకే తెచ్చిపెడితే జనాలకు సోమరితనం అలవాటవుతుంది. అందుకే సాధ్యమైనంతవరకు సంక్షేమం అనేది పేదలకు చెందాలి. అలాగని పేదరికం దీర్ఘకాలం ఉండకుండా ప్రభుత్వాలు కొత్త విధానాలకు రూపకల్పన చేయాలి. అప్పుడే దేశ ఆర్థిక చక్రం గతి తప్పకుండా ఉంటుంది.