5G Speeds In India: భారతదేశంలో ఐదోతరం టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశీయ టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ ఐదో తరం టెలికాం సేవలను కొన్ని మెట్రో నగరాల్లో అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఐదోతరం టెలికాం ఇంటర్నెట్ వేగం నాలుగవ తరంతో పోలిస్తే పదిరెట్లు వేగంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఐదవ తరం టెలికం సేవల వేగాన్ని అంచనా వేసేందుకు ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఓక్లా పరీక్షించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసాయి.

ఏం వేగం?
అక్టోబర్ 1 నుంచి దేశంలో ఐదోతరం టెలికాం సేవలు ప్రారంభమయ్యాయి. ఆపరేటర్లు నెట్వర్క్లను పరీక్షించగా అందులో 5జి డౌన్లోడ్ స్పీడ్ 16.27 Mbps నుంచి 809.94 Mbps వరకు ఉందని విశ్లేషణలో తేలింది. సాధారణంగా మన దేశంలో 4జి ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ యావరేజ్ గా సెకనుకు 21.1 MB గా ఉంటుంది. ఈ స్పీడ్ తో పోలిస్తే ప్రస్తుతం 5 జి నెట్వర్క్ ఇండియాలో కొన్నిచోట్ల చాలా రెట్లు అధికంగా డౌన్లోడ్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నది. ఒక్లా సంస్థ నివేదిక ప్రకారం 5జి టెస్ట్ నెట్వర్క్ లో డౌన్లోడ్ వేగం 500 Mbps డాటా డౌన్లోడ్ అవుతోంది. రిలయన్స్ జియో 598.58 Mbps తో అగ్ర స్థానంలో ఉంది.. భారతీ ఎయిర్టెల్ ఢిల్లీలో 197.98 Mbps తో రెండో స్థానంలో ఉన్నది. జూన్ 2022 నుంచి ఢిల్లీ, కోల్ కతా, ముంబాయి, వారణాసితో సహా నాలుగు మెట్రో నగరాల్లో 5 జీ డౌన్లోడ్ స్పీడును ఒక్లా రికార్డు చేసింది. ముంబాయి లో ఎయిర్ టెల్ 271.07 Mbps మధ్యస్థ డౌన్లోడ్ వేగంతో జియో కంటే వెనుకబడి ఉంది. ఆగస్టు 2022లో మొబైల్ డౌన్లోడ్ వేగం 13.52 Mbps వేగంతో భారతదేశం 117 వ స్థానంలో ఉంది.
కాల్ డ్రాప్ లే గుది బండ
ఐదోతరం టెలికం సేవలు అందుబాటులోకి వచ్చినా నేటికీ చాలా ప్రాంతాల్లో సెల్ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. ఉదాహరణకు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చాలా గ్రామాల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. ఏదైనా అత్యవసరమైతే ఇక అంతే సంగతులు. మరోవైపు సిగ్నల్ ఉండే ప్రాంతాల్లో కాల్ డ్రాపింగ్ సమస్య వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ సమస్యపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు రోజుకు వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిని సరిదిద్దుకునేందుకు ట్రాయ్ పలుమార్లు అవకాశాలు ఇచ్చినా టెలికాం కంపెనీలు పెడచెవిన పెడుతున్నాయి. ముఖ్యంగా కాల్ డ్రాపింగ్ సమస్యపై ఫిర్యాదులు అధికంగా ఐడియా వోడాఫోన్ కంపెనీపై వస్తున్నాయి. నగరాల్లోనూ సిగ్నల్ సరిగా లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. అదే నెంబర్ తో ఇతర నెట్వర్క్ లోకి వెళ్లేందుకు వినియోగదారులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

ప్రారంభించిన మొదట్లో జియో కూడా మెరుగైన సిగ్నల్ ఇచ్చేది. అని రాను రాను ఆ సిగ్నల్ లోనూ నాణ్యత కొరవడుతోందని వినియోగదారులు వాపోతున్నారు. తమకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే నగరాల్లోనే జియో, ఎయిర్ టెల్ మెరుగైన సిగ్నల్స్ ఇస్తున్నాయని, ఇదే సమయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా విస్మరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి ట్రాయ్ నివేదిక ప్రకారం నగరాలతో పోల్చితే పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లోనూ నెట్ వినియోగం పెరిగింది.. స్మార్ట్ ఫోన్ వాడకం పెరగడంతో అందరూ కూడా నెట్ ను విరివిగా వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో టెలికం కంపెనీలు తమ నెట్వర్క్ విస్తృతిని పెంచితే వినియోగదారులకు ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్ల భారత ర్యాంకు 117 వ ర్యాంక్ వద్దే కొట్టుమిట్టాడుతోంది.