https://oktelugu.com/

BJP : దక్షిణాదిన బీజేపీ సిగపాట్లు.. భారీగా తగ్గనున్న ఎంపీ సీట్లు

ప్రాంతీయ పార్టీలు సైతం బీజేపీతో కలిసి నడిచేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. మొత్తానికైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక రకమైన క్లిష్ట పరిస్థితిని బీజేపీ ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..

Written By:
  • Dharma
  • , Updated On : May 15, 2023 9:42 am
    Follow us on

    BJP : కర్నాటకలో ఓటమితో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా? గడ్డురోజులు దాపురించాయా? దక్షిణాదిపై ఆశలు వదులుకోవాల్సిందేనా? ప్రాంతీయ పార్టీల మద్దతుకు దేబిరించాల్సిందేనా? వారిచ్చే సీట్లతో సర్దుబాటు చేసుకోవాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపీ సీట్లు గెలుచుకోవడం సాహసమే చెప్పుకోవాలి. కర్నాటకలో గత లోక్ సభ ఎన్నికల్లో దాదాపు బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 28 సీట్లకుగాను 27 చోట్ల విజయం సాధించింది. అయితే ఇప్పుడా పరిస్థితి ఉందా? అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 135 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు ఉంటుంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఆ పార్టీ 20 స్థానాలకుపైగా దక్కే అవకాశముంది. బీజేపీ పదిలోపే స్థానాలు దక్కనున్నాయి.

    అన్ని రాష్ట్రాల్లోనూ..
    మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీకి అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో 4 స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. ఈసారి ఆ నాలుగు నిలబెట్టుకోవడం కష్టమన్న సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మెజార్టీ ఎంపీ స్థానాలు ఆ పార్టీ ఖాతాలో పడడం ఖాయం.  అదే జరిగితే బీజేపీ చేతిలో ఉన్న నాలుగు స్థానాలు చేజారే అవకాశం ఉంది. ఏపీలో అమాత్రం అసలు బీజేపీకి చాన్సే లేదు. టీడీపీ, జనసేనతో పొత్తు కుదురితే ఒకటి, రెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం కష్టం. కేరళ, తమిళనాడులో అయితే అసలు బీజేపీ ఖాతా కూడా తెరుచుకోలేని పరిస్థితి. ఎలా చూసుకున్న దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి భారీ డ్యామేజ్ ఖాయం.

    వ్యతిరేక ముద్ర..
    మరోవైపు బీజేపీపై దక్షిణాది వ్యతిరేక ముద్ర క్రమేపీ పెరుగుతోంది. అది మరింత ముదిరితే మాత్రం బీజేపీ ఎటువంటి ప్రయత్నాలు చేసినా రాష్ట్రాల్లో ప్రవేశించడం మరింత కష్టమవుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా కొంతలో కొన్ని సీట్లు నిలబెటు్టకునే అవకాశం ఉంది. అయితే ఇన్నాళ్లూ ప్రాంతీయ పార్టీలు పొత్తులకు ముందుకొస్తే బీజేపీ పట్టించుకోలేదు. ఇప్పుడు బీజేపీ బలం తగ్గుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో ప్రాంతీయ పార్టీలు సైతం బీజేపీతో కలిసి నడిచేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. మొత్తానికైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక రకమైన క్లిష్ట పరిస్థితిని బీజేపీ ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..