History Repeat : శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య ఈ ముగ్గురూ దక్షిణ భారత దేశం నుండి దేశమంతటికీ విస్తరించారు. అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతంగా ప్రచురమైన భావవాద తాత్విక చింతనను ప్రచారం చేశారు. అందుకు అవసరమైన అన్ని కష్టాలు పడ్డారు. అనేక రచనలు చేశారు. తమ తాత్వికతను చిరకాలం నిలిపి ఉంచే కృషిలో ఆనంద పడ్డారు. జీవితం ఉండని స్థితి లో మాత్రమే జన్మ సాఫల్యత ఉందని మనం నిమిత్త మాత్రులమని సమాజానికి నూరి పోశారు. పరివర్తన అంటే కూడా విశ్వాసులుగా పరివర్తనే అని నమ్మించారు. కోరక పోవటం,అడగకపోవటం, పోల్చకపోవటం, ముక్తికి మార్గం అన్నారు. అంతా మాయే కనుక అంతా ఈశ్వరేచ్చ కనుక, భగవదేచ్చకనుక మనం నిమిత్త మాత్రులం అన్నారు. అనేక ప్రార్థనా రచనలు, వర్ణనలు, ఉక్తులు, పునరుక్తులతో, సుఖ దుఃఖాల, విషాద బీభత్సాల కథనాలతో తమ ఉక్తులకు బలం పెంచుకున్నారు. వారి సాహిత్యాన్ని విప్పి వివేచిస్తే వెలుగు చూసిన ప్రశ్నలను మరుగు పరచటానికి అల్లిన అనేక కథనాలు కనిపిస్తాయి. ఇది వైదిక భావ జాలంగా బలపడింది. నిలబడింది.

ఈ ముగ్గురు సమాజాన్ని యధాతధంగా కాపాడటానికి ఎంతో శ్రమ పడ్డ వాళ్ళుగా అర్థం కావటానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. న్యాయ భావనతో, హేతుబద్దమైన శాస్త్రీయమైన పోలికలతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలను గట్టిగా ప్రశ్నిస్తే చాలు. చరిత్రలో ప్రశ్నలుగా నిలిచిన వాళ్ళని అడ్డు తొలగించుకోవటానికి వీరు ప్రచారంచేసిన ఆలోచనలనే పాలకులు ఉపయోగించుకున్నారు. వీరు ప్రచురం చేసిన భావజాలమే చార్వాక, బౌధ్ధ,శ్రమణక , చింతనను దెబ్బ తీసే ఆయుధం అయింది. ఈ భావజాలం సాధనతోనే తీవ్ర హింసకు పాల్పడిన పాలకులు తాము నిమిత్త మాత్రులుగా అంతా భగవదేచ్చగా ప్రచారం చేసుకున్నారు.వర్ణధర్మాన్ని కులధర్మాన్ని సువ్యవస్థితం చేయటమే రాజ్య ధర్మంగా ఆమోదం నిర్మాణం చేశారు. ఈ వైదిక ధర్మం ఇతర మత ధర్మాలను అంగీకరించదు. లొంగ దీసుకుంటుంది. కలిపేసుకుంటుంది. కానిచో నిర్మూలించాలని నిరంతర కృషిలో ఉంటుంది. ఆ కృషి నేటికీ కొనసాగుతోంది..
ఈ ముగ్గురు ఆచార్యులకు ఈ నాటికీ వారసులున్నారు.అశ్రమాలున్నాయి.అస్తులున్నాయి. ఇవన్నీ సమకూర్చే వ్యక్తులు,శక్తులు, సంఘటిత, అసంఘటిత మూకలున్నాయి. ఈ అన్నిటికీ అండగా నిలిచే పాలక వర్గాలు న్నాయి. వాళ్లు నడిపే రాజ్యం ఉన్నది. ఆ భావజాలం, ఆ భావజాల ప్రాతినిధ్యం ఒంటరి కాదు. అది మళ్లీ మళ్లీ బల పడుతున్నది. ప్రజలు ప్రజాస్వామిక ఆలోచనలు రెక్క విప్పినపుడు కాస్త అణిగి మణిగి ఉండే ఈ వైదిక భావజాలం ఎలా చెలరేగుతూ వచ్చిందో ఈ పది దశాబ్దాల కాలాన్ని మనం క్లోజ్ గా చూస్తే చాలు. ఇపుడు ఈ భావజాలానికి కాస్త బలమైన అనుకూలమైన కాలం కలిసి వచ్చింది. వీరందరూ లేచి నిలిచారు. సైన్స్ ను, హేతువును, అసమానతలు, ఆధి పత్యాలు లేని సమాజం కోసం ప్రజలు చేసిన త్యాగాలను, ఆ చరిత్రను త్రోసివేసి, తాము పాల్పడిన హింసను మరుగు పరుస్తూ అనేక ప్రదర్శనలు చేస్తున్నారు. అలాంటి అనేక ప్రదర్శనలలో ముచ్చింతల్ ప్రదర్శన ఒకటి. దీనికి అనేకం కలిసి వచ్చాయి.
అసలు విషయం ఏమిటంటే.. ఇది ఇట్లాగే ఉండదు. సైన్స్ కాదు కర్మ సిద్ధాంతమే కీలకం అనే వాళ్లు సైన్స్ ఫలితాలు ఉపయోగించకుండా ఒక్కటంటే ఒక్క రోజు కూడా గడపలేరు. తమ భావవాద భావ జాలమే విజేత అనే వాళ్లు చరిత్ర లో చాలా సహజంగా శిరసెత్తిన భౌతిక వాద ఆలోచనలను తట్టు కోలేక పోతున్నారు. నిర్దిష్ట చారిత్రిక స్పష్టతతో ఆలోచనలలో విస్తరిస్తున్న పరివర్తన ఆకాంక్షను తట్టుకోలేక పోతున్నారు. సమత మాట ఎత్త కుండా గడప లేని స్థితిలోనే వారు తమ భావజాల విగ్రహ ప్రతినిధికి సమతామూర్తి అని పేరు పెట్టారు. రామానుజుడు వర్ణ వ్యవస్థకి, కుల వ్యవస్థకి రక్షణగా నిలిచిన భావవాద భావ జాల ప్రతినిధి మాత్రమే కానీ సమతా ప్రతినిధి ఎంత మాత్రమూ కాదు.
భారత శ్రామిక జన జీవనంలో మౌలిక పరివర్తన కోసం చరిత్ర పొడవునా తమ జీవితాలు అర్పించిన,సామాన్య జీవితాలు గడిపిన అసామాన్య యోధులే నిజమైన ప్రేరణ. ఇలాంటి పిల్లి మొగ్గలు చరిత్ర ముందడుగు వేయకుండా ఎల్ల కాలం అపలేవు. ఎక్కువ కాలమూ అపలేవు. ఈ అకురాలు కాలం లోంచి వసంతం రాక తప్పదు.