
ఉత్తరప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారిపై బీజేపీ కాకర్యకర్తలు కొట్టాడనే ఫిర్యాదు చేశారు. ఏకంగా ఐఏఎస్ అధికారి ఓ టీవీ రిపోర్టర్ ను వెంటపడి మరీ కొట్టడం వంటి దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. స్తానిక సంస్థల ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఐఏఎస్ అధికారులు సైతం విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం విస్మయం కలిగిస్తోంది.
ఓ జర్నలిస్ట్ ను ఐఏఎస్ అధికారి చేయి చేసుకున్న ఘటన విమర్శలకు దారి తీస్తోంది. ఓ టీవీ రిపోర్టర్ వెంటపడి పట్టుకుని ఐఏఎస్ అధికారి కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉన్నతాధికారి బహిరంగంగా జర్నలిస్ట్ పై చేయిచేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నావ్ లోని మియాగంజ్ చీఫ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (సీడీవో)గా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ దివ్యాన్షు పటేల్ జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు.
ఎన్నికల సమయంలో అక్కడ పరిస్తితులను జర్నలిస్ట్ తన సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తుండగా సీడీవో దివ్యాన్షు పటేల్ రెచ్చిపోయాడు. పోలీసులు అడ్డుకోవడంతో ఆ జర్నలిస్ట్ అతడి నుంచి తప్పించుకోగలిగాడు. అయితే దివ్యాన్షు పటేల్ పై జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు చేశాడు. లోకల్ కౌన్సిల్ సభ్యుల ఓటింగ్ లో పాల్గొనకుండా అపహరించారని పేర్కొన్నారు.
అందులో దివ్యాన్షు పటేల్ హస్తం కూడా ఉందని తెలిపారు. ఆ ఘటనను వీడియో తీసినందుకే తనపై దాడి చేశాడని పేర్కొన్నాడు. జర్నలిస్ట్ ఆరోపణలపై సీడీవో దివ్యాన్షు ఇంకా స్పందించలేదు. ఈ దాడి ఘటనపై జర్నలిస్ట్ నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు ఉన్నవ్ కలెక్టర్ తెలిపారు. జర్నలిస్ట్ పై అధికారి దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.