Electoral Bonds: పార్టీలకు నిధులిచ్చిన కంపెనీల అసలు బాగోతం ఇదీ!

ఫ్యూచర్ గేమింగ్ సంస్థ రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున నిధులు అందిస్తోంది. ఈ సంస్థ గత ఐదు సంవత్సరాలలో 1368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అయితే ఈ పార్టీ ఇప్పటివరకు బాండ్లను ఏ పార్టీకి ఇచ్చిందనే వివరాలు తెలియ రాలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 16, 2024 1:28 pm

Electoral Bonds

Follow us on

Electoral Bonds: రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో వచ్చిన నిధులకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిన రెండు జాబితాలు దేశంలో ఇంకా కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేకసార్లు మొట్టికాయలు వేయడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగివచ్చింది. అస్పష్టంగా వివరాలు వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. వివిధ రాజకీయ పార్టీల బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల చరిత్ర లోప భూయిష్టంగా ఉంది. నిధులు ఇచ్చిన వాటిలో చాలా కంపెనీలు పలు రకాల ఆరోపణలు ఎదుర్కొన్నవే ఉన్నాయి. వాస్తవానికి ఆరోపణలు ఉన్న కంపెనీలే అధిక బాండ్లు కొనుగోలు చేయడం.. ఆస్తులు అటాచ్ చేసిన వెంటనే బాండ్లు కొనుగోలు చేయడం.. అనుమానాలకు తావిస్తోంది.

ఫ్యూచర్ గేమింగ్ సంస్థ రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున నిధులు అందిస్తోంది. ఈ సంస్థ గత ఐదు సంవత్సరాలలో 1368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అయితే ఈ పార్టీ ఇప్పటివరకు బాండ్లను ఏ పార్టీకి ఇచ్చిందనే వివరాలు తెలియ రాలేదు. ఈ సంస్థ ప్రధానంగా లాటరీ వ్యాపారం చేస్తుంది.. 2019లో ఈ సంస్థపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఆ ఏడాది జూలై నెలలో ఈ సంస్థకు చెందిన 250 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అటాచ్ చేశారు. 2022 ఏప్రిల్ 2న మరో 409.92 కోట్ల ఆస్తులనూ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అటాచ్ చేశారు. ఇది జరిగిన ఐదు రోజులకే అంటే ఏప్రిల్ 7న ఈ సంస్థ 100 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది.

ఇక మేఘా, వేదాంత సంస్థలపై కూడా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.. మేఘా సంస్థ 2019 నుంచి 2024 మధ్యకాలంలో 966 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొన్నది. ఈ సంస్థ పై 2019 అక్టోబర్ నెలలో ఐటీ దాడులు జరిగాయి..ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కూడా ఈ సంస్థ ఆర్థిక లావాదేవీలపై విచారణ నిర్వహిస్తున్నారు. అత్యధికంగా ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన ఐదవ సంస్థగా నిలిచిన వేదాంత గ్రూప్ 376 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. 2019 ఏప్రిల్ నెలలో మొదటిసారి వేదాంత గ్రూప్ ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. అంతకుముందు సంవత్సరం ఒక కేసు కు సంబంధించి ఈ సంస్థపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారణ చేపట్టారు.

ఎన్నికల బాండ్లను ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు కొనుగోలు చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “దేశంలో నల్లధనాన్ని తుడిచి పెట్టేందుకే కేంద్రం ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు ఈ పథకం రద్దుతో సమాజంలోకి నరాధనం తిరిగి వస్తుందని ప్రజలు భయపడాలి. సుప్రీంకోర్టు తీర్పుపై నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలచుకోలేదు. అయితే ఎన్నికల బాండ్ల పథకంతో నల్లధనాన్ని ఎలా నిర్మూలించాలో చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని” అమిత్ షా వ్యాఖ్యానించారు.