Railway Reservation: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పండుగలు దసరా, సంక్రాంతి. ఈ పండుగల వేళ పట్టణాలు, నగరాల్లో ఉండేవారు తమ సొంత ఊర్లకు వెళ్లి హాయిగా గడపాలని అనుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. విదేశాల్లో ఉండే వారు సైతం ఈ పండుగలకు తమ గ్రామానికి వస్తూ ఉంటారు. అయితే పండుగల సీజన్ వేళ అందరూ ఒకే సమయానికి ఊర్లలోకి వెళ్లడం వల్ల ప్రయాణ సాధనాలు రద్దీగా మారుతాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకునే వారికి రైళ్ల సౌకర్యం అనుగుణంగా ఉంటుంది. కానీ రైల్లో బెర్త్ దొరికేందుకు ఎన్నో నెలల నుంచి రిజర్వేషన్ చేసుకొని ఉండాలి. అయితే వచ్చే దసరాకే రైళ్ల రద్దీ ఇప్పుడే పెరిగిందంటే ఆశ్చర్యం కాదు. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read: కెనడాలో ఖలిస్తాన్ రిపబ్లిక్ రాయబార కార్యాలయమాట?
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 2న దసరా రాబోతోంది. తెలంగాణలో అయితే దసరా కంటే ముందే 9 రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు. దీంతో మహిళలు తమ పుట్టింటికి వెళ్లి బతుకమ్మ ఆటలు ఆడుతూ,, పాటలు పాడుతూ ఉంటారు. అయితే మిగతావారు మాత్రం దసరా పండుగకు రెండు రోజుల ముందే ఇంటికి చేరాలని అనుకుంటారు. దీంతో ప్రీ ప్లాన్ గా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి ట్రైన్ టికెట్ దొరకడం కష్టంగా మారిపోయింది. ఎందుకంటే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బెర్తులు లేక వెయిటింగ్ లిస్ట్ వస్తోంది.
అక్టోబర్ 2న దసరా పండుగ ఉండడంతో రెండు రోజుల ముందే ఇంటికి చేరాలని అనుకుంటారు. అంటే సెప్టెంబర్ 28 నుంచి తమ సొంత ఊర్లకు వెళ్లాలని ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలామంది బెర్తులు బుక్ చేసుకున్నారు. దీంతో సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఖాళీ లేనట్లు చూపిస్తుంది.
సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలకు రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కలకత్తా వెళ్లే ఫలక్ నుమా ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 23 నుంచి వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్ళింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలకు వెళ్లే సిల్చర్ ఎక్స్ప్రెస్ టికెట్ దొరకడం కష్టంగానే ఉంది. అయితే ఇప్పటికే ఈ సమాచారం చాలామందికి తెలియడంతో ఇతర రైళ్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆ సమయంలో ఎలా వెళ్లాలో ప్లాన్ చేసుకుంటున్నారు. దసరా పండుగ సందర్భంగా కనీసం వారం రోజులపాటు సెలవులు ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని సంస్థలు మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే సెలవులకు అవకాశం ఇస్తాయి. అందువల్ల వీరు సెప్టెంబర్ 28 నుంచి తమ ప్రయాణాలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఆ మూడు తేదీల్లో టికెట్ల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పుడే ఈ పరిస్థితి ఇలా ఉంటే.. ఇక పండుగనాటికి ఎలా ఉంటుందోనని కొందరు అంటున్నారు.