Heavy Rains: ఉత్తరాది లో ఎందుకింత కుంభవృష్టి?

ఉత్తరాది రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడి, ఇతర వర్ష సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు 60 మందికి పైగా మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పిడుగుపాటు, ఇతర ఘటనల కారణంగా 34 మంది చనిపోయారు.

Written By: Bhaskar, Updated On : July 12, 2023 8:57 am

Heavy Rains

Follow us on

Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో కనివిని ఎరుగని స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాదిలో ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.. దేశ రాజధాని ఢిల్లీ తోపాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాలు నీటిలో మునిగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నివాస ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి. కొన్ని చోట్ల ఇళ్ళు, భవనాలు, చెట్లు నేలమట్టమయ్యాయి. సాధారణ జనజీవనం అతలాకుతలమైంది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.. కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ఆయన నదుల్లోకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. వరద నీటిలో లారీలు, కార్ల వంటి వాహనాలు కొట్టుకుపోతున్నాయి.

60 మందికి పైగా మృతి

ఉత్తరాది రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడి, ఇతర వర్ష సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు 60 మందికి పైగా మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పిడుగుపాటు, ఇతర ఘటనల కారణంగా 34 మంది చనిపోయారు. వర్షాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో కొండ చర్యలు విరిగిపడి నలుగురు మరణించారు. హిమాచల్ వరదల్లో పలుచోట్ల రెండు వందల మందికి పైగా చిక్కుకుపోయారు.. హర్యానా రాష్ట్రంలో వరద నీటిలో ఒక బస్సు చిక్కుకుంది. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను రెస్క్యూ బృందం కాపాడింది. ఇక గత 50 సంవత్సరాలలో ఈ స్థాయిలో వర్షాన్ని ఎప్పుడూ చూడలేదని హిమాచల్ ప్రదేశ్ వాసులు అంటున్నారు. కేవలం ఈ ఒక్క రాష్ట్రంలోనే 17 మంది చనిపోయారు. 4000 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించింది. ఇక వర్షాల తాకిడి వల్ల హిమాచల్ ప్రదేశ్ లో 1000 కి పైగా రహదారులను మూసివేశారు. పలు జిల్లాలో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయింది.

పొంగుతున్న నదులు

ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రముఖమైన యమునా నది భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతోంది. హర్యానా నుంచి వరద నీరు పోటెత్తడంతో ఢిల్లీలోని యమున నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. యమునా నది డేంజర్ మార్క్ 205.33 మీటర్లు కాగా.. అది 205.40 మీటర్లు దాటి ప్రవహిస్తోంది నేపథ్యంలో 39 ఎన్ డి ఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వ మోహరించింది. ఉత్తరాదితోపాటు దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నైరుతి రుతుపవనాల కాలంలో జూన్ నెలలో దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాత లోటును పూడ్చాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. జూన్ నెలలో 10 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. జూలై నెలలో తొలి ఎనిమిది రోజుల్లోనే అది మిగులుకు చేరుకుంది. ప్రస్తుత నైరుతి రుతుపవన కాలంలో 243.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అది సాధారణ వర్షపాతం 239.1 కంటే రెండు శాతం ఎక్కువ. వర్షపాతం నమోదు విషయంలో దేశంలోని ప్రాంతాలవారీగా తేడాలు ఉన్నాయి. ఐఎండి సమాచారం ప్రకారం తూర్పు, ఈశాన్య ప్రాంతాల పరిధిలో 17% లోటు వర్షపాతం అంటే 454 మిల్లీమీటర్లకు 375.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఉత్తర భారతంలో 59 శాతం అధికంగా అంటే 125.5 బిల్లీ మీటర్లకు 199.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నైరుతి రుతుపవనులపై అధికంగా ఆధారపడే మధ్య భారత రీజియన్ లో నాలుగు శాతం అధిక వర్షాలు పడ్డాయి. ఇక దక్షిణ భారత దేశం విషయానికొస్తే వర్షపాతం లోటు 45 నుంచి 23 శ
శాతానికి తగ్గింది.