DMK MP A Raja: సనాతన ధర్మాన్ని డెంగ్యూ, చికెన్ గున్యా గా అభివర్ణించి.. ఏగంగా సుప్రీంకోర్టుతో చివాట్లు తిన్నాడు తమిళనాడు డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్. చివరికి తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశాడు. దీనిపై బిజెపి గాయి గాయి చేసింది. డీఎంకే తీరును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తూర్పార పట్టారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యల రగడ సద్దుమణగక ముందే ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది..
మంగళవారం రాజా చెన్నైలోని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ” జైశ్రీరామ్, భారతమాత అనే బిజెపి సిద్ధాంతాలను తమిళనాడు ఎన్నటికీ అంగీకరించబోదు. భారత్ ఎన్నడూ ఒక దేశంగా లేదు. వివిధ ఆచారాలు, సంస్కృతులతో కూడిన ఒక ఉపఖండం. ఒక దేశమంటే ఒక భాష, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి ఉంటుంది. అలాంటి లక్షణాలు ఉంటేనే ఏదైనా ఒక దేశం అవుతుంది.. భారత్ ఒక్క ఉపఖండం. తమిళం అనేది ఒక జాతి, ఒక దేశం కూడా. అదేవిధంగా మలయాళం అనేది ఒక భాష, ఒక జాతి, ఒక దేశం. ఇలాంటి అన్ని జాతుల సమూహంతో భారత్ ఏర్పాటయింది. కాబట్టి భారత్ అనేది ఒక దేశం కాదు.. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఒడిశా వంటి రాష్ట్రాలు స్థానిక సంస్కృతిలను కలిగి ఉంటాయి. మణిపూర్ లో కుక్క మాంసం తినడం ఒక స్థానిక సంస్కృతి. కాశ్మీర్లో కూడా ఒక రకమైన విధానం ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి ఒక్క సాంస్కృతి గుర్తించాలి. ఒక సామాజిక వర్గం ఒక జంతువు మాంసాన్ని తింటే.. దాన్ని కూడా గుర్తించాలి. అందులో మీకు వస్తున్న సమస్య ఏమిటి? మిమ్మల్ని తినమని చెప్పలేదు కదా? భిన్నత్వాలను గుర్తించలేని వారు ఒక దేశంగా ఎలా పేర్కొంటారని” రాజా పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే ఉండదని ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేశారు. దానికి ప్రతిగా రాజా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. “తమిళనాడులో డీఎంకే ఉండదని మోడీ చెప్పారు. అలాంటప్పుడు భారతదేశం కూడా ఉండదు. బిజెపి నాయకులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. మళ్లీ వారు అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు. రాజ్యాంగం లేకుంటే భారతదేశం కూడా ఉండదు. భారతదేశం లేకుంటే తమిళనాడు రాష్ట్రం తమిళనాడు గా ఉండదు. మేము బయటికి వెళ్లిపోతాం. మోడీ ఇదే కోరుకుంటున్నారా? భారతదేశానికి ఇదే ముఖ్యమా? రాముడికి శత్రువు ఎవరు? సీతతో కలిసి రాముడు అడవులకు వెళ్లాడని మా తమిళ్ టీచర్ చెప్పారు. అతను వేటగాడని అంగీకరించాడు. సుగ్రీవుడు, విభీషణుడిని సోదరులుగా ఒప్పుకున్నాడు. నాకు రామాయణం తెలియదు. రాముడు అంతకన్నా తెలియదు. నేను దానిని నమ్మను” అని రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బిజెపి నాయకులు స్పందిస్తున్నారు. “డీఎంకే ఎంపీ రాజా మాట్లాడిన మాటలు మావోయిస్టు సిద్ధాంతాలను ప్రతిబింబిస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలను సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే సమర్ధిస్తారా? సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని గతంలో ఉదయనిది స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజా కూడా అలానే మాట్లాడుతున్నారు. వీరి మాటలు ద్వారా దేశ విభజనకు పిలుపునిస్తున్నారా” అని బిజెపి నాయకులు రవిశంకర్, అమిత్ మాలవ్య మండిపడ్డారు. రాజా చేసిన వ్యాఖ్యల పట్ల ఇండియా కూటమిలోని నాయకులు మౌనం పాటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు రాజా చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనేత్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. రాముడు అందరివాడన్నారు. కులమతాలు, ప్రాంతాలకు ఆయన అతీతుడని ఆమె పేర్కొన్నారు.