Digital Emergency In India: డిజిటల్ ఎమర్జెన్సీగా పిలిచే ఇంటర్నెట్ సేవల నిలిపివేతలో భారత దేశం ప్రపంచలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇంటర్నెట్ కట్ దేశంలో ఏటా పెరుగుతోంది. దేశంలో ఏ చిన్న ఆందోళన జరిగినా, ఉద్రిక్తత తలెత్తినా ప్రభుత్వాలు తీసుకునే తొలి చర్యగా ఇంటర్నెట్ కట్ చేస్తున్నాయి. గడిచిన నాలుగేళ్లలో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లో ఇండియా ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

ఆందోళన ఏదైనా తొలి చర్య అదే..
జమ్మూకశ్మీర్‌లో అల్లర్లు, పంజాబ్‌లో హింస, రాజస్థాన్‌లో గొడవలు, హైదరాబాద్ పాతబస్తీలో మత ఘర్షణ, భైంసాలో ఉత్సవాలు.. కారణం ఏదైనా ప్రభుత్వాలు మొదట తీసుకుంటున్న చర్య ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడమే. తాజాగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అగ్గి రాజుకున్నా, ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా రాజస్తాన్‌లో జరిగిన హత్యపై ఉద్రిక్తతలు తలెత్తినా, సాగు, పౌరసత్వ సవరణ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటినా… ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేసింది.
సోషల్ మీడియా ఎఫెక్ట్..

ఏ ఉద్యమమైనా ఉద్యమకారులు సోషల్ మీడియా వేదికలను వినియోగించుకునే వ్యూహాలు పన్నుతున్నారు. క్షణాల్లో సమాచారం దేశమంతా వ్యాప్తి చెందుతోంది. దీంతో అన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. దశాబ్దం క్రితం వరకు ఏక్కడైనా అల్లర్లు, మత ఘర్షణలు జరిగితే ఆ విషయం ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వరకూ ఇతర ప్రాంత ప్రజలకు తెలిసేది కాదు. ఇంకా ముందుకు వెళ్తే మరుసటి రోజు వార్తా పత్రికలు చూసే వరకు దేశంలో ఏం జరిగిందో తెలియని పరిస్థితి. కానీ ఇస్పుడు సాంకేతికత అభివృద్ధి చెందింది. స్మార్ట్ ఫోన్ల రాకతో డిజిటల్ ప్రపంచం అందరి గుప్పిట్లోకి చేరింది. దీంతో సామాజిక మాధ్యమం ఉద్యమాల్లో కీలకంగా మారుతోంది. ఎన్నికల ఫలితాలనే తారుమారు చేసే పరిస్థితికి డిజిటల్ మీడియా ఎదిగిందనడంలో అతిశయోక్తి లేదు. దేశంలో అసాంఘిక శక్తులు దీనికి ఎక్కువగా వినియోగిస్తున్నాయి. దీంతో విధిలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉద్యమాలు, ఆందోళన సమయంలో తొలి చర్యగా ఇంటర్నెట్ నిలిపి వేస్తున్నాయి.
డిజిటల్ సేవలకు అంతరాయం..
శాంతిభద్రతల కారణంతో ఒకప్పుడు కశ్మీర్‌కే పరిమితమైన ఈ ధోరణి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నిచోట్లకూ విస్తరించడం వివాదాస్పదమవుతోంది. కరోనా అనంతరం వర్క్ ఫ్రమ్ హోం, ఆన్‌లైన్ క్లాసులు, డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయిన నేపథ్యంలో ఇంటర్నెట్ లేకుండా పూట గడవని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి హెచ్చరికలూ లేకుండా ఉన్నట్టుండి నెట్ సర్వీసులు నిలిపివేస్తుండటంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంతోమంది జీవనోపాధిపైనా ప్రభావం చూపుతోంది.
ఆరు నెలల్లో 59 సార్లు…
భారత్‌లో ఇంటర్‌నెట్ షట్‌డౌన్స్‌పై అధ్యయనం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్(ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ) ప్రకారం 2012 నుంచి ఇప్పటివరకు దేశంలో ఏకంగా 665 సార్లు ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. గళమెత్తే గొంతుకల్ని అణిచివేయడానికి నెట్ నిలిపివేతను ఆయుధంగా వాడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని సంస్థ చెబుతోంది. ఈ ఏడాదిలోనే జూన్ నాటికి దేశంలో ఏకంగా 59 సార్లు నెట్ కనెక్షన్ కట్ అయింది! జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో విధించిన ఇంటర్నెట్ షట్‌డౌన్ దేశంలోనే అత్యంత సుదీర్ఘమైనది. కశ్మీర్ ప్రజలు ఏకంగా 552 రోజులు నెట్ సౌకర్యానికి దూరమయ్యారు. తరచూ నెట్‌ను నిలిపేస్తున్న రాష్ట్రాల జాబితాలో కశ్మీర్ తర్వాత రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
Also Read: CM KCR- Gurukul Schools: గురుకులాలపై కేసీఆర్ సంచలన నిర్ణయం
ఆర్థికంగానూ ప్రభావమే…
ఇంటర్నెట్ షట్‌డౌన్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటోంది. 2019లో 4 వేల గంటలపాటు దేశంలో నెట్ సేవలు ఆగిపోవడంతో 130 కోట్ల డాలర్లకుపైగా నష్టం కలిగిందన్నది ప్రపంచ బ్యాంకు అంచనా. ఇంటర్నెట్ లేక తాను పత్రికను ప్రింట్ చేసుకోలేకపోతున్నానని, మరెందరో జీవనోపాధి కోల్పోతున్నారని కశ్మీర్‌కు చెందిన అనూరాధా భాసిన్ అనే జర్నలిస్టు సుప్రీంకోర్టుకెక్కారు. నిరవధికంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేయడం ఆమోదయోగ్యం కాదని ఆమె పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది.
పౌర హక్కులకు భంగమేనా?
చీటికీమాటికీ ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేయడం పౌరులకు రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులకు భంగకరమేనని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్(ఐఎఫ్‌ఎఫ్) అనే న్యాయవాదుల గ్రూపు వాదిస్తోంది. దీనిపై ఈ సంస్థ పలుమార్లు కోర్టుకెక్కింది. ఇంటర్నెట్ సదుపాయముంటే విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయే తప్ప, అది ఉంటే వారు వాస్తవాలు తెలుసుకునే అవకాశమూ ఉంటుందని ఆలోచించలేకపోతోందన్నది సంస్థ వాదన.
Also Read: MP Raghuramakrishna Raju: రఘురామరాజు విషయంలో మీడియా ఎందుకు సైలెంట్?