AIIMS Server Down: లక్షల కోట్లు విలువ ఉన్న మన ఆర్థిక వ్యవస్థలో చిన్న చిన్న లోపాలే పరువు తీస్తాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ వైద్యాలయంలో గత కొద్ది రోజులుగా అక్కడి సిబ్బంది మాన్యువల్ విధానంలో పనిచేస్తున్నారు. దీనికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే అప్పుడు తెలిసింది… ఆసుపత్రికి సంబంధించి కంప్యూటర్లన్నీ హ్యాక్ అయ్యాయని..రాన్స్ సమ్ వేర్ ను ఆసుపత్రి సర్వర్లోకి పంపించిన హ్యాకర్లు 200 కోట్ల రూపాయలను క్రిప్టో కరెన్సీ రూపంలో ఆన్లైన్ విధానంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఏమిటి రాన్స్ సమ్ వేర్?
రాన్స్ సమ్ వేర్ అనేది వైరస్ కాదు. మాల్ వేర్ లో ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్. ఒకసారి హ్యాకర్ కంప్యూటర్ లేదా ఏదైనా సంస్థకు చెందిన సర్వర్స్ ను యాక్సెస్ చేయగలిగితే వెంటనే తన సాప్ట్ వేర్ ఇన్ స్టాల్ చేస్తాడు. అది సర్వర్స్ లో ఉన్న మొత్తం సమాచారాన్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది.. దీంతో ఆ సర్వర్ అనుసంధానంగా ఉన్న అన్ని కంప్యూటర్లు డాటా ను యాక్సెస్ చేయలేవు. సర్వర్ లో ఉన్న అన్ని ఫైల్స్ లాక్ అయిపోతాయి.. ఫోల్డర్ పేర్లు మారిపోతాయి. అన్ని ఫైల్స్ కి ఒకే ఎక్స్టెన్షన్ ఉంటుంది.. హ్యాకర్ డిమాండ్ చేసిన డబ్బు ఇస్తే రాన్స్ సమ్ వేర్ కి ఒక కీ ఇస్తాడు. దానిని ఉపయోగించి తిరిగి డాటా మామూలుగా వాడుకోవచ్చు.
ఎందుకు ఇలా చేస్తున్నారు
2020లో యాంటీ వైరస్ ను అందించే అన్ని సంస్థలు కూడా రాన్స్ సమ్ వేర్ కు విరుగుడు కనిపెట్టలేకపోయాయి. దాంతో చాలావరకు సంస్థలు డబ్బులు చెల్లించి దీని బారి నుంచి బయటపడ్డాయి. ఎన్క్రిప్షన్ అనేది హ్యాకర్ సొంతంగా ప్రోగ్రాం చేస్తాడు.. కాబట్టి దానిని వేరే వాళ్ళు కనిపెట్టలేరు. ఒక్కో హ్యాకర్ ఒక్కో రకమైన ఆల్గారిథం రాస్తాడు. గత ఏడాది కొన్ని సంస్థలు రాన్స్ సమ్ వేర్ దాడులతో తమ డాటాను కోల్పోయాయి. కానీ 80 శాతం సంస్థలు హ్యాకర్స్ కు డబ్బులు చెల్లించి తిరిగి తమ డాటా పొందగలిగాయి.
వాళ్లే డబ్బులు డిమాండ్ చేస్తున్నది
రాన్స్ సమ్ వేర్ ఉపయోగించి ఉత్తరకొరియా, ప్యాన్ యాంగ్ నుంచి హ్యాకర్లు భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. చైనాకు చెందిన ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు కూడా వివిధ రకాలైన సైబర్ దాడులు చేస్తున్నారు. మరికొన్ని దేశాలు కూడా వీటితో సంబంధం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం చైనాలో కోవిడ్ భూతం సృష్టిస్తున్న విలయంతో ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ నిరసనలు ఎదుర్కొంటున్నారు.. ఈ క్రమంలో ఢిల్లీలోని ఏయిమ్స్ మీద సైబర్ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. కోవిడ్ కి సంబంధించి పరిశోధన చాలావరకు ఢిల్లీలోని ఆ ఆసుపత్రిలోనే జరుగుతోంది.. ఈ ఆస్పత్రిలో దాదాపు నాలుగు కోట్ల రోగులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.. వీటిలో మాజీ ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, కోర్టు న్యాయమూర్తుల వివరాలు ఉన్నాయి..
తీవ్ర నిర్లక్ష్యం
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు సైబర్ ప్రొటెక్షన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో విండోస్ ఎక్స్ పీ ని వాడుతున్నారు. మైక్రో సాప్ట్ విండోస్ 7 కి సెక్యూరిటీ అప్డేట్స్ నిలిపివేసి ఏడాది పూర్తయింది.. అయినప్పటికీ చాలా సంస్థల్లో దానినే వాడుతున్నారు.. ఇక విండోస్ 10 చాలా వరకు రక్షిస్తుంది.. దానికంటే విండోస్ 11 మరింత రక్షణ కల్పిస్తుంది. కానీ హ్యాకర్లు ఎప్పటికప్పుడు తమ ఆల్గారిథం మార్చుకుంటూ వెళ్తారు.. అందువల్ల యాంటీ రాన్సమ్ వేర్ టూల్స్ రక్షణ ఇవ్వలేవు. ఎంతో పటిష్టమైన యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టాన్ని కూడా హ్యాకర్లు యాక్సెస్ చేయగలుగుతున్నారు. గూగుల్, ఆండ్రాయిడ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఇలా దేనిని కూడా హ్యాకర్లు వదిలిపెట్టడం లేదు.

సురక్షితం కాదు
మనం వాడే ఫోన్ కూడా అంత సురక్షితం కాదు.. ఇటీవల గూగుల్ ప్లే స్టోర్ కొన్ని హానికరమైన ఆప్స్ తొలగించింది. ఆండ్రాయిడ్ కూడా అంత సురక్షితం కాదు .. న్యు జనరేషన్ ప్రాసెసర్లు కలిగిన మొబైల్ ఫోన్లు కొంతమేర సురక్షితం. తరచూ వాడుతున్న కంప్యూటర్ లేదా ఆపరేటింగ్ సిస్టాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. లేకపోతే అంతే సంగతులు.. మూడు సంవత్సరాలు దాటిన మొబైల్ ఫోన్లకు అప్డేట్స్ రావు.. అలాంటప్పుడు ఇంటర్నెట్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా ఇంటర్నెట్ వాడుతూ విండోస్ 7 ఉపయోగించే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి.. లేని పక్షంలో హ్యాకర్ల బారిన పడక తప్పదు. చేతులు కాలాక ఆకులు ముట్టుకునే దానికంటే.. అసలు చేతులు కాలకుండా చూసుకోవడం ఉత్తమం.