ప్రపంచంలో మరే దేశం మీద చేయనంత దాడిని.. భారత్ మీద కొనసాగించింది కరోనా! నిత్యం లక్షలాది కేసులు నమోదయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ దశలో ఒక్క రోజు కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది. మరణాలు 4 వేలకుపైగా నమోదయ్యాయి. ఇలాంటి దారుణ పరిస్థితుల్లోంచి ఇప్పుడిప్పుడే దేశం తెరపిన పడుతోంది. రోజువారి సంఖ్యల 2 లక్షల దగ్గర నమోదవుతోంది.
ఈ తగ్గుదల పెద్దదేం కాకపోయినా.. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోందని స్పష్టమవుతోంది. దీనికి ఆయా రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. కేంద్రం కరోనా భారాన్ని రాష్ట్రాల మీదకు వదిలేసిన వేళ.. రాష్ట్రాలే తమ పరిస్థితుల మేర నిర్ణయాలు తీసుకున్నాయి. కొన్నిచోట్ల ముందస్తుగా లాక్ డౌన్ వంటి కఠిన చర్యలు తీసుకోగా.. మరికొన్ని చోట్ల ఆచితూచి నిర్ణయం ప్రకటించారు.
లాక్ డౌన్ వల్ల ఉపాధి, ఇతరత్రా కష్టాల సంగతి ఎలా ఉన్నా.. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. అయితే.. ఈ మార్పుతో ఆనందించే పరిస్థితి లేకపోవడం గమనార్హం. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ తగ్గుతున్నప్పటికీ.. మరోవైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అంటూ.. విజృంభిస్తుండడం భయాందోళన కలిగిస్తోంది.
చాలా ప్రమాదకరమైన ఈ ఫంగస్ లతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఓ మహమ్మారి నుంచి బయటపడి మరో దానికి చిక్కినట్టుగా.. కొవిడ్ నుంచి కోలుకున్న వారు చాలా మంది ఈ ఫంగస్ లకు బలయ్యారు. దీన్ని అడ్డుకునేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోందనేది స్పష్టత లేదని అంటున్నారు. అటు కొవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. అది కూడా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
ఇటు చూస్తే.. వ్యాక్సిన్ ఇంకా ఎన్నో కోట్ల మందికి ఇవ్వాల్సి ఉంది. ఉత్పత్తి సరిగా లేదని అంటున్నారు. విదేశాల నుంచి దిగుమతి అన్నారు.. అది ఎంత వరకు వచ్చిందో తెలియదు. ఈ విధంగా.. చాలా సమస్యలు జనాన్ని వేధిస్తున్నాయి. ఓవైపు సెకండ్ వేవ్ తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నప్పటికీ.. మరోవైపు ఈ ప్రమాదాలు కనిపిస్తుండడంతో.. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.