CAG Report 2019-20 : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను, అందులోని లోటు పాట్లను కాగ్ పూసగుచ్చింది. రాష్ట్రంలో అప్పులు దారుణంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే.. భవిష్యత్ లో ప్రమాదం తప్పదని హెచ్చరించింది. అసెంబ్లీకి చెప్పకుండా తీసుకుంటున్న నిర్ణయాలనూ ఆక్షేపించిన కాగ్.. ఏపీ ఆర్ధిక వ్యవస్ధ మొత్తం అస్తవ్యస్తంగా మారిందని తేల్చి చెప్పింది. ఇంకా ఏం చెప్పిందంటే..

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంవత్సరం 2019-20కి సంబంధించి కాగ్ నివేదిక విడుదలైంది. 2020 మార్చి నాటికి పూర్తయిన పద్దుల ఆధారంగా.. కాగ్ రూపొందించిన ఈ రిపోర్ట్ ను.. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో.. రాష్ట్ర సర్కారు.. సగటున 6.31 శాతం వడ్డీతో అప్పులు తెస్తోందని కాగ్ వెల్లడించింది. తెచ్చిన అప్పుకు సైతం సరైన ప్రతిఫలం లేకుండా పోతోందని చెప్పింది. ఫలితంగా.. ప్రభుత్వం సేకరిస్తున్న రుణాలన్నీ వృథా అవుతున్నాయని కాగ్ పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. భవిష్యత్ లో రుణం పుట్టకపోగా.. వనరులు సైతం అందుబాటులో లేకుండా పోతాయని హెచ్చరించింది.
ప్రతీఏటా వస్తున్న ఆదాయంలో.. అప్పులు తీర్చడానికే ఖర్చు పెట్టాల్సి వస్తోందని కాగ్ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో తీసుకున్న అప్పుల వడ్డీలకు, తీర్చేందుకు.. కొత్తగా తెచ్చిన అప్పుల్లో దాదాపు 60 శాతం పైన ఖర్చుపెడుతున్నట్లు కాగ్ వెల్లడించింది. ఇది ఆర్ధిక అస్ధిరతకు దారి తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది కాగ్.
రాష్ట్రం చేసిన, తీర్చాల్సిన అప్పుల చిట్టాను కాగ్ పేర్కొంది. మార్చి 2020 నెల వరకు ఉన్న లెక్కలు చూస్తే.. రాబోయే ఏడేళ్లలో తీర్చాల్సిన అప్పు.. ఏకంగా రూ.లక్షా పది వేల కోట్లుగా ఉందని కాగ్ అంచనా వేసింది. మరి, ఈ అప్పులు ఎలా తీరుస్తారన్నది పెద్ద ప్రశ్న. ఈ మేరకు ఆర్ధిక వనరులు సమకూర్చుకోలేకపోతే.. అనివార్యంగా మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక, సర్కారు విధానాలనూ కాగ్ తూర్పారబట్టింది. అసెంబ్లీకి చెప్పకుండానే సర్కారు నిర్ణయాలు తీసుకుంటున్నదని కాగ్ గుర్తించింది. ఇలా సభకు తెలియకుడా 2019-20 ఆర్ధిక ఏడాదిలో రూ.15,991 కోట్లు ఖర్చు చేసి, ఆర్ధిక సంవత్సరం ముగిసిన తర్వాత అసెంబ్లీకి తెలిపినట్టు కాగ్ చెప్పింది. ఇది రాజ్యాంగానికి సైతం విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఇదేకాకుండా.. రూ.26,096 కోట్ల అప్పుల్ని సైతం బడ్డెట్ లో ప్రస్తావించలేదని, ఇది శాసన సభను నీరుగార్చడమేనని ఆక్షేపించింది కాగ్. ఇదేకాకుండా.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు వచ్చిన నిధులను సైతం.. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినట్టు చెప్పింది. తద్వారా.. కేంద్ర పథకాల అమలు లక్ష్యం నెరవేరట్లేదని తెలిపింది. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.