Chandrayaan-3: “చంద్రుడిలో ఉండే కుందేలు కిందికి వచ్చిందా.. కిందికి వచ్చి నీలా మారిందా? ” అని నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశాడు. అంతటితోనే ఆగిపోయాడు.. ఆ చంద్రుడి మీద కుందేలు ఎందుకు ఉందో, ఆ మచ్చ ఎందుకు కొరకరాని కొయ్యగా మారిందో కనీసం తన పాటలోనైనా వివరించలేకపోయాడు. ఏదో సరదాకు ఇలా ఉపోద్ఘాతం ఇచ్చాం కానీ.. మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో సూర్యుడు అంటే మండే అగ్ని గోళం. అక్కడికి వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగాలు చేయలేదు. అదే చంద్రుడయితే చల్లని వాడు కాబట్టి.. శాస్త్రవేత్తలు మరింత ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు, రకరకాల ఉపగ్రహాలు చంద్రుడి మీదికి పంపించారు. అయినప్పటికీ చంద్రుడు తన అద్భుతాలను చూపిస్తూనే ఉన్నాడు. అవి ఏంటో కనుక్కోండి అని శాస్త్రవేత్తల బుర్రలకు పదును పెడుతూనే ఉన్నాడు. ఇక చైనా, అమెరికాతో పోలిస్తే చంద్రుడి మీద మనం చేసిన ప్రయోగాలు తక్కువ ఏం కానప్పటికీ.. ఇంకా ఆ గుట్టు మట్లు తెలుసుకునే పనిలో ఇస్రో పడింది. ఈసారి ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 కి శ్రీకారం చుట్టింది. దీని అనుసంధానానికి ఎల్విఎం_3 రాకెట్(జి ఎస్ ఎల్ వి మాక్_3)ను సిద్ధం చేస్తోంది.
శ్రీహరికోటలో..
ఈ రాకెట్ తో పాటు దీనిలో ఏర్పాటు చేసే అన్ని పరికరాలను తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట ఇస్రో ప్రయోగ కేంద్రానికి చేరవేసింది. ప్రస్తుతానికి ఉపగ్రహంతో పాటు ప్రొపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ తనిఖీ చేపట్టింది. కొన్ని ప్రాథమిక పరీక్షలు కూడా చేసింది. దీనిని త్వరలో రాకెట్ కు అనుసంధానించనుంది. అన్ని అనుకూలిస్తే జూన్ రెండో వారంలో రాకెట్ ను పూర్తిగా సిద్ధం చేయనుంది. జూలై నెల మధ్యలో చంద్రయాన్_3 ప్రయోగం చేస్తామని ప్రకటించింది.
ఈ ప్రయోగాలు ఎందుకు?
ఈ విషయంలో భూమి తప్ప జీవరాశి జీవించేందుకు మరో గ్రహం లేదు. అయితే యాదృచ్ఛికంగా కొన్ని కొన్ని గ్రహాలలో స్వల్ప అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు చంద్రుడు కూడా మినహాయింపు కాదు. అయితే చంద్రుడిలో అక్కడక్కడా నీటి జాడలు, హీలియం, నియాన్ నిల్వలు ఉన్నాయి. నీటి జాడ ఉంటే కచ్చితంగా అక్కడ ఆక్సిజన్, హైడ్రోజన్ ఉంటుంది. జీవరాశి జీవించేందుకు ఆక్సిజన్ అవసరం కాబట్టి.. అక్కడ ఆక్సిజన్ ఏ స్థాయిలో ఉంది? ఆ స్థాయిలో ఆక్సిజన్ కనుక ఉంటే జీవరాశి మనుగడ సాగించగలదా? హీలియం, నియాన్ నిల్వలు ఉన్నాయి కాబట్టి.. ఇంకా ఏమైనా అరుదైన ఖనిజాలు చంద్రుడిలో ఉన్నాయా? అని తెలుసుకునేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.
గగన్‌యాన్ ఆగస్టుకు వాయిదా..?
మానవ సహిత వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో గగన్‌యాన్ మిషన్ చేపట్టనుంది. అయితే దానికోసం ముందుగా రెండు ట్రయల్స్ నిర్వహించాలని భావించింది. అందులో భాగంగా తొలి టెస్ట్ మిషన్ ప్రయోగాన్ని జూలైలో చేపట్టాలని భావించినప్పటికీ.. పనుల జాప్యం వల్ల అది ఆగస్టుకు మారే అవకాశాలున్నాయని ఇస్రో అధికారులు చెబుతున్నారు. లాంచ్ వెహికిల్ కూడా పూర్తయిందని, క్రూ మాడ్యూల్, ఇతర వ్యవస్థలు సిద్ధమవుతున్నాయని వారు వివరిస్తున్నారు. మొదటి, రెండో విడత పరీక్షలు విజయవంతమైతే 2024-25లో మానవ మిషన్ గగన్‌యాన్ ప్రయోగం ఉంటుందంటున్నారు. కాగా, సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో చేపడుతున్న ఆదిత్య ఎల్-1 ప్రయోగం కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలున్నాయి. దీన్ని ఆగస్టులోనే చేపట్టాలని భావించినప్పటికీ.. దానికంటే ముందు నిర్వహించే ప్రయోగాల జాప్యం కారణంగా ఇది మరింత ఆలస్యం అవుతుందని ఇస్రో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దాని పై త్వరలోనే ప్రకటన
హైపర్‌సోనిక్ ఎయిర్ బ్రీతింగ్ వెహికిల్ (హవా) గురించి త్వరలోనే ఇస్రో. కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. హైపర్ సోనిక్ వేగంతో ఎగిరే కొత్త రాకెట్ ‘హవా’ను ఇస్రో ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోంది. హవా అంటే ఎయిర్ ఇంటిగ్రేషన్ వ్యవస్థతో కూడిన హైపర్ సోనిక్ ఎయిర్ బ్రీతింగ్ వాహనం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఇస్రో వర్గాలు అంటున్నాయి. ఇక అగ్ని క్షిపణుల శ్రేణిలో సరికొత్త మిసైల్, రాత్రి వేళ కూడా లక్ష్యాలను ఛేదించగల ‘అగ్ని ప్రైమ్’ క్షిపణికి నిర్వహించిన ఇస్రో ఒక పరీక్ష నిర్వహించగా.. అది విజయవంతమైంది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ బాలిస్టిక్ మిసైల్‌ను పరీక్షించారు. కొత్తతరం మిసైల్ అగ్ని ప్రైమ్‌కు ఒడిశా తీరంలో మొదటి ప్రీ ఇండక్షన్ నైట్ పరీక్ష నిర్వహించగా. ఇది అన్ని నిర్దేశిత లక్ష్యాలను అందుకుంది.