దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దింతో రైల్వేస్టేషనల్లో భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. సికింద్రాబాద్ మెయిన్ జోన్ గా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొమ్మిది రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు. ఈ ఉదయం 6 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి తెలంగాణ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. అలాగే సికింద్రాబాద్ నుంచి దానాపూర్ ఎక్స్ ప్రెస్ కూడా బయల్దేరింది. రైలు బయలుదేరే సమయంకు తొంభై నిమిషాల ముందే స్టేషన్ కు చేరుకోవాలని రైల్వే శాఖ పేర్కొనడంతో అలాగే వేలాది మంది ప్రయాణికులు గంటన్నర ముందే స్టేషన్ కి చేరుకుంటున్నారు.
ఇక ఆరోగ్య పరీక్షలు చేసి టికెట్ కన్ఫాం అయిన వారిని మాత్రమే పోలీసులు లోపలి పంపుతున్నారు. వందల సంఖ్యలో వస్తున్న ప్రయాణికులతో క్యూ రోడ్డుపై దాకా ఉంది. ఇక స్టేషన్ లోపల ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా నేల మీద గుర్తులు వేశారు. స్టేషన్ కు చేరుకున్న ప్రయాణికులకు పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపిస్తున్నారు. ఈ నెల 29 నుంచి తత్కాల్ టికెట్లు కూడా జారీ చేయనున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో ఫుడ్ కోర్టులు, ఇతర దుకాణాలు తెరుచుకున్నప్పటికీ పార్శిళ్లు అంటే టేక్ ఎవే తీసుకెళ్లాల్సి ఉంటుంది.