HomeజాతీయంPOK - Modi : పీవోకే విలీనం దిశగా కేంద్రం అడుగులు.. మోడీ ఇస్తున్న సంకేతాలు...

POK – Modi : పీవోకే విలీనం దిశగా కేంద్రం అడుగులు.. మోడీ ఇస్తున్న సంకేతాలు అవే

POK – Modi : ఈ నెల 18వ తేదీ నుంచి ఐదు రోజులపాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)పై కేంద్రప్రభుత్వం తీర్మానం తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పీఓకేలో నివసిస్తున్న ప్రజలు పాకిస్థాన్‌ ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుండటం, భారత్‌లోని లద్ధాఖ్‌లో విలీనం అవుతామని పీఓకేలోని కొంత ప్రాంతం డిమాండ్‌ చేస్తుండటం కూడా సానుకూల సంకేతమని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, బీజేపీకి ఇది భారీ ప్రచారాస్త్రం కూడా అవుతుందని ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పీఓకేపై పారమెంటులో తీర్మానం చేసే అవకాశాలు ఉన్నాయని, అది వీలుకాకపోతే 1994లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో పార్లమెంటు చేసిన తీర్మానాన్నే పునరుద్ఘాటించవచ్చునని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్రమంత్రి, మాజీ సైనిక ప్రధానాధిపతి జనరల్‌ వీకే సింగ్‌ ఇటీవల.. పీఓకే తనంతట తాను భారత్‌లో విలీనం అవుతుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జూన్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా కశ్మీర్‌లో సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, పీఓకేను వెనక్కి తీసుకోవడానికి భారతదేశం పెద్దగా కష్టపడక్కర్లేదని అన్నారు. ఈ అంశంపై మూడుసార్లు పార్లమెంట్‌ తన అభిప్రాయాన్ని ప్రకటించిందని తెలిపారు. ఇవన్నీ పీఓకేపై ప్రభుత్వ ఆలోచనను వెల్లడిస్తున్నాయి.

జీ 20తో సానుకూల వాతావరణం!

జీ 20 సమావేశాల్లో భారత్‌కు పశ్చిమ దేశాల అండ పెద్దఎత్తున లభించడం, అంతర్జాతీయంగా భారత్‌ స్థాయి పెరగడంతో పీఓకేలో చర్యలకు సమయం అనువుగా ఉన్నదని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, పీఓకేలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయటాన్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. పీఓకేలో ఉన్న సహజ వనరులను పాకిస్థాన్‌ ప్రభుత్వం కొల్లగొట్టడం, పెద్ద ఎత్తున అవినీతి పెచ్చరిల్లడం, అత్యాచారాలు, హింసాకాండ పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, అక్కడ నెత్తుటేర్లు పారే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానిక వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయి. పీఓకేలోని విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి పాక్‌ ప్రభుత్వం యూనిట్‌కు రూపాయిన్నర చెల్లించి కొనుగోలు చేసి అదే ప్రాంతానికి రూ.52కు యూనిట్‌ చొప్పున అమ్మడం, గోధుమ పిండి వంటి నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటడంపై ప్రజలు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రజలు పాక్‌ ప్రభుత్వ అరాచకాలను వ్యతిరేకిస్తూ భారత్‌ అధీనంలో ఉన్న లద్దాఖ్‌లో విలీనం అవుతామని కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.

17న అఖిలపక్ష సమావేశం

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ఒక రోజు ముందైన సెప్టెంబరు 17వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి బుధవారం వెల్లడించారు. ఇప్పటికే అన్ని పార్టీలకు ఈ-మెయిల్‌ ద్వారా ఆహ్వానాన్ని పంపించామని, త్వరలో లేఖలను కూడా పంపుతామని తెలిపారు. కాగా, సమావేశాల్లో ఎజెండాపై కేంద్రం బుధవారం రాత్రి కొన్ని వివరాలను ప్రకటించింది. సమావేశాల తొలిరోజున 75 ఏళ్ల భారతదేశ ప్రస్థానంపై చర్చ ఉంటుందని తెలిపింది. తర్వాత రోజుల్లో సీఈసీ, ఎన్నికల సంఘం ఇతర కమిషనర్ల నియామకాల బిల్ల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular