Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో గురువారం (ఫిబ్రవరి 1న) మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రజలకు లబ్ధి చేకూరే అంశాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది.
3 కోట్ల మంది లక్షాధికారులుగా..
కేంద్రం స్వయం సహాయక సంఘాల ద్వారా 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలతోపాటు ప్రజల వాస్తవిక ఆదాయం పదేళ్లలో 50 శాతానికిపైగా పెరిగిందని తెలిపారు.
వారిక ఉచిత విద్యుత్..
ఇక ఈ బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక మంత్రి ఓ గుడ్‌న్యూస్ తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే సోలార్ రూఫ్‌టాప్ ద్వారా విద్యుత్ పొందే గృహాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఇంటిపైకప్పు సోలార్ ప్లేట్స్ అమర్చుకోవడానికి అయ్యే ఖర్చులో సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. రాయితీ గడువు 2026 మార్చి 31 వరకు ఉందని తెలిపారు. ప్రతీ ఇంటికి సోలార్ ఇన్‌స్టాలేషన్ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ లక్ష్యం పూర్తయ్యే వరకూ రాయితీ కొనసాగిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ప్రోత్సాహకంగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.